హైదరాబాద్, జులై 9 (విజయక్రాంతి): గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నా కూడా మహిళలకు న్యాయం జరగలేదని, ఇప్పుడు కూడా రాష్ట్రంలో అదే తీరు కొనసాగుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి అన్నారు. గరీబీ హఠావో అంటూ నినాదాలు ఇచ్చారు కానీ గరీబోళ ్ల బతుకులు మారలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మాదిరిగానే రాష్ర్టంలో ప్రజలకు అనేక రకాల హామీలిచ్చి.. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మభ్యపెడుతోందని విమర్శించారు.
మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయ డంలో వైఫల్యం చెందిందంటూ.. కానరాని కాంగ్రెస్ గ్యారెంటీలు- కదం తొక్కిన మహిళలు పేరిట మంగళవారం ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో కిషన్ రెడ్డి ప్రసంగిం చారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారు..? ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం ఎప్పుడిస్తారు.. రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం ఇంకెప్పు డిస్తారు..? అంటూ ప్రశ్నించారు. ‘మహిళలకు ప్రతి నెలా రూ. 2,000 సాయం ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి
ఏడు నెలలు గడిచినా అమలు చేయలేదు. ఇప్పటివరకు ప్రతి మహిళకు రూ. 20 వేల చొప్పున బకాయి పడింది. మహిళలకు రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ అంటూ హామీ ఇచ్చింది. అతీగతి లేదు. రైతులు, కౌలు రైతులకు ఏటా రూ. 15,000 పంట పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 సాయం ఇస్తామని చెప్పారు.. అదీ లేదు. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలందరికీ ఉచితంగా స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. రాష్ర్టంలో అంగన్‌వాడీ టీచర్లు సమస్యల్లో కూరుకుపోయారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయ్.. నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డెక్కారు. రాష్ర్ట ప్రభుత్వం పట్టింపులేకుండా ప్రవర్తిస్తోంది’ అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కలలు కనండి.. హామీలు మర్చిపోండి అనే పాలసీలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నడుచుకుంటోందని ఆయన విమర్శించారు.
కాలం వెళ్లదీస్తున్నారు
రాష్ర్టంలో రెగ్యులర్ బస్సులను సగానికి పైగా తగ్గించి, నామమాత్రంగా ఉచిత బస్సు ప్రయాణం అంటూ ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు, మహిళకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ఊరుకెళ్తే ఆ ఊరిలో... దేవుళ్ల మీద ఒట్లు పెట్టి కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసే ఆలోచన చేయడం లేదన్నారు. డిసెంబరు 9 తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుందని, రైతుల అప్పులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుందని, కొత్తగా అప్పులు తీసుకోండని పొంకనాలు మాట్లాడారని విమర్శించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఎక్కడపోయిందని ప్రశ్నించారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ కూడా తెలంగాణ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 210 మంది మహిళలే గెలవబోతున్నారు...
తొలి మంత్రివర్గంలో ఏ ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఘనుడు కేసీఆర్ అని కిషన్ రెడ్డి విమర్శించారు. 50 శాతం మహిళా జనాభా ఉన్న రాష్ర్ఠంలో కనీసం మహిళా మంత్రి లేకుండా పాలించిన చరిత్ర ఆయనదని అన్నారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంపై కాంగ్రెస్ పార్టీ నాన్చుతూ వచ్చింది తప్ప.. పరిష్కారం చేయలేదన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనంలో చేసిన మొట్టమొదటి చట్టమే మహిళా రిజర్వేషన్ అని తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పనతో బీజేపీ మహిళా పక్షపాతి అని నిరూపించుకుందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 210 మంది మహిళలే గెలవబోతున్నారని తెలిపారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోనూ 40 మంది ఎమ్మెల్యేలు మహిళలు రిజర్వేషన్ల ద్వారా ఎన్నికవుతారని అన్నారు. మోదీ చేసేదే చెప్తారు. ఏది చెబుతారో అది అమలు చేసి చూపిస్తారని, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చెప్పిందో అది ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయదన్నారు.
7 నెలల్లోనే వేల కోట్ల అప్పులు...
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే వేలకోట్ల అప్పులు తెచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. రైతు రుణమాఫీ కోసం మళ్లీ అప్పుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల అప్పుల మయంగా మార్చారని... ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పులమీదనే ఆధారపడ్డారని అన్నారు. ప్రభుత్వ భూములు, లిటిగేషన్, హౌసింగ్ బోర్డు భూములు అమ్మడం.. అప్పులు చేయడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణలోని అనేక గ్రామాల్లో అక్రమంగా వేలాది బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు. బెల్ట్ షాపులను తొలగిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించిందన్నారు. దీన్ని ఇప్పుడు మరో 5 సంవత్సరాలు పొడిగించిందని.. తాము ఉచితంగా రేషన్ ఇస్తుంటే రేషన్ కార్డులు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డికి వచ్చిన ఇబ్బందేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికలముందు హామీ ఇచ్చిందని ఇప్పటికీ అమలు కాలేదన్నారు. 6 గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేస్తామని సోనియాగాంధీ సంతకంతో కూడిన ఉత్తరాన్ని ప్రతి ఇంటింటికి పంపిచారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గారడీలతో ఎన్నికల్లో గెలిచిందన్నారు. నేడు 6 గ్యారంటీలను, హామీలను అమలు చేసే పరిస్థితిలో లేదని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేంత వరకు వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.
హామీలు అమలు చేయకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
- బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 214 రోజులు అయినా మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అన్నారు. మహిళలపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా చర్యలు తీసుకోలేని మంత్రులు రాష్ట్రంలో ఉన్నారని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే సీఎం, మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మహిళా మోర్చా నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.