26-03-2025 12:49:42 AM
న్యూఢిల్లీ, మార్చి 25: ఆలయాల్లో విక్రయించే ప్రసాదాలపై జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎత్తివేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. అలాగే ఈవీ బ్యాటరీలు, ఫోన్లపై కూడా దిగుమతి పన్ను ను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. ‘దేశీయంగా ఉత్పత్తిని పెంచి, తద్వారా ఎగుమతులు చేసేలా ఇక్కడి పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు కొన్ని ముడిపదార్థాలపై పన్నులను తగ్గిస్తున్నాం.
ఈవీ బ్యాటరీల తయారీలో వాడే 35 రకాల వస్తువులకు, మొబైల్ ఫోన్ల తయారీకి ఉపయోగించే 28 రకాల వస్తువులకు పన్ను నుంచి మినహాయింపును ఇచ్చాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించబోతున్న పరస్పర సుంకాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
రెండు దేశాల వాణిజ్యంపై ఈ సుంకాల ప్రభావం పడకుండా ఉండేందుకు రెండు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. డిజిటల్ పన్ను ను కూడా రద్దు చేస్తున్నాం’ అని ఆర్థిక మంత్రి తెలిపారు. కాగా ‘ఆర్థిక బిల్లు 2025’ లోక్‌సభలో ఆమోదం పొందింది.