- కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్/సిరిసిల్ల, నవంబర్ 26 (విజయక్రాంతి): ఏడాది కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్ష దివస్ సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు, ఆటో డ్రైవర్లతోపాటు హైదరాబాద్ నగర ప్రజలపై పగ పెంచుకుని కాంగ్రెస్ సర్కార్ వేధిస్తోందని మండిపడ్డారు.
హైడ్రా పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెడుతున్న బాధలను చెప్పుకునేందుకు ప్రజలు తెలంగాణ భవన్‌కు వస్తున్నారని, తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్‌గా మారిందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీఆర్‌ఎస్ అఖండ మెజార్టీ గెలవటం ఖాయమని చెప్పారు.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు, ఇతర పదవులు అనుభవించిన వారు పార్టీ మారినప్పటికీ కార్యకర్తలు మాత్రం బీఆర్‌ఎస్ కు కొండంత అండగా ఉన్నారని చెప్పారు. ఓఆర్‌ఆర్ లోపల ఉన్న హైదరాబాద్‌ను మూడు లేదా నాలుగు ముక్కలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్రలో బీజేపీకి కూడా భాగం ఉందన్నారు.
బీజేపీకి, కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి డబ్బుల మూటలు పంపిస్తున్నారని విమర్శించారు. బీజేపీతో కలవాల్సిన అవసరం బీఆర్‌ఎస్‌కు లేదని తేల్చిచెప్పారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను ఏదీ మాట్లాడినా ఏదో ఒకటి చేసి కేసులో ఇరికించి అరెస్ట్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు.
నూలు డిపోను వేములవాడలో పెడుతారా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనీస అవగాహన లేదని, రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్లలో నేతన్నలు ఉన్నా ఇక్కడ పెట్టాల్సిన నూలు డిపోను వేములవాడలో పెట్టడం ఎంతవరకు సమంజసం ఉన్నారు. తెలంగాణ ఏర్పాటైన జూన్ 2వ తేదీ ఎంత ముఖ్యమో, రాష్ట్ర ఏర్పాటుకు కీలక మలుపు అయిన కేసీఆర్ దీక్ష చేపట్టిన నవంబర్ 29 కూడా అంతే ముఖ్యమన్నారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపా ల్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ జడ్పీ చైర్ పర్సన్ నేలకొండ అరుణ, పట్టణ అధ్యక్షుడు జీందం చక్రపాణి, బండ నరసయ్య పాల్గొన్నారు.
కాంగ్రెస్ తప్పడు విధానాలను ఎండగట్టాలి: పద్మారావుగౌడ్
సాధ్యంకానీ హామీలిచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ తప్పుడు విధానాలను ప్రజలకు నాయకులు ఎప్పటికప్పడు వివరించాలని మాజీ మంత్రి పద్మారావుగౌడ్ కోరారు. ఇప్పటికే నగర ప్రజలు రేవంత్ పాలనను చూసి నవ్వుతున్నారన్నారు. తర్వాత అధికారం మానదేనని, శ్రేణులంతా చురుకుగా పనిచేయాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో మళ్లీ పీఠం బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.
బెదిరింపులకు భయపడం: మాగంటి గోపినాథ్
గ్రేటర్‌లోని కొందరు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్ నేతలను బెదిరిస్తున్నారని, వారికి భయపడే ప్రసక్తిలేదని హైదరాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా గ్రేటర్ నగరంలో మాత్రం గులాబీ గాలి వీచి మెజార్టీ సంఖ్యలో ఎమ్మెల్యేలు విజయం సాధించారని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇదే ధైర్యంతో ముం దుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ కార్యకర్తగా కలెక్టర్..
సిరిసిల్ల కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నాడని, తమ పార్టీ నాయకులను పార్టీ మారాలని అడుగుతున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఇటువంటి సన్నాసిని కలెక్టర్‌గా తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలెవ్వరు కూడా భయపడవద్దని, రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ఎవరూ తమను ఏమీ చేయలేరన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించే అధికారులకు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. కొడంగల్ రైతులకు దగ్గరకు వెళ్లలేని పరిస్థితి రేవంత్‌రెడ్డిది అన్నారు. 9 నెలలుగా నిరసన, ధర్నాలు చేస్తున్నా వాళ్లకు ముఖ్యమంత్రి సమయం ఎందుకు ఇవ్వడం లేదన్నారు.
రేవంత్‌రెడ్డి కేవలం అదానీ, తన అన్న, అల్లుడు, బావమరిది కోసమే పని చేస్తున్నాడని విమర్శించారు. 28 సార్లు ఢిల్లీకి పోయి 28 రూపాయలు కూడా తీసుకురాలేదన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినా 8 రూపాయల నిధులు కూడా కేంద్రం నుంచి తేలేదన్నారు.
నగర అభివృద్ధి శూన్యం: తలసాని
బీఆర్‌ఎస్ హయాంలో వేగంగా అభివృద్ధికి నోచుకున్న గ్రేటర్ హైదరాబాద్ నగరం రేవంత్ పాలనలో అభివృద్ధి శూన్యంగా మారిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత వాటిని విస్మరించాడని విరుచుకుపడ్డారు. తమ పార్టీకి చెందిన నాయకులను బెదిరింపులకు గురిచేస్తూ కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని, వారు పార్టీ వీడినంత మాత్రం ఎలాంటి నష్టం లేదన్నారు.
ప్రజాస్వామిక పాలన కొనసాగించాలి
రేవంత్‌కు కేటీఆర్ లేఖ
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): రేవంత్ పాలనలో పౌరుల హక్కులను తొక్కేస్తూ, రాష్ర్ట ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ఒకవైపు రాహుల్‌గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతి లో పట్టుకుని రాజ్యాంగ విలువలను కాపాడుతామని చెబుతుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగ ప్రమాణాలను, విలువలను పూర్తిగా ఉల్లంఘిస్తోందన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు గౌరవ సూచకంగా కేసీఆర్ ప్రభు త్వం అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ర్ట ఆవిర్భా వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా సాధ్యమైందన్నారు. ప్రతి తెలంగాణ పౌరుడు అంబేద్కర్‌కు రుణపడి ఉంటారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్‌పై ఉన్న వ్యక్తిగత కక్షతో అంబేద్కర్ విగ్రహానికి ఒక్కసారైనా రేవంత్‌రెడ్డి గౌరవించకపోవడం బాధాకరమన్నారు. ఇది రాజ్యాంగ రూపకర్తకు అవమానంగానే తాము భావిస్తు న్నామన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారని ఆరోపించారు. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కుల్లో ప్రసంగ స్వేచ్ఛ కీలకమైనదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హక్కును తొక్కి పెట్టడం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయమన్నారు.