18-02-2025 12:33:41 AM
ఆ గ్రామస్థుల ఆందోళన
సిద్దిపేట, ఫిబ్రవరి17 (విజయక్రాంతి): ఎల్కతుర్తి నుండీ రామయంపేట వరకు నిర్మించే హైవే రోడ్డు నిర్మాణంలో భాగంగా రంగదాంపల్లి నుండి బ్లాక్ ఆఫీస్ వరకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే రంగదాంపల్లి గ్రామ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సోమవారం స్థానిక రంగాదం పల్లి చౌరస్తా అమరవీరుల స్తూపం వద్ద టెంటు వేసుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలోని మూడో వార్డు రంగదాంపల్లి లోని జాతీయ రహదారిపై బిడ్జి నిర్మాణం చేపట్టవద్దని , ప్లై ఓవర్ వద్దు పాత రోడ్ కావాలంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే రైల్వే లైన్ లో కాలేశ్వరం ప్రాజెక్టులో తమ భూములు కోల్పోయామని ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం చేస్తే చిరు వ్యాపారస్తులు తమ ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిడ్జి రూట్ మార్చి హైదారాబాద్- కరీంనగర్ రాజీవ్ రహదారి పై ఫ్లైఓవర్ నిర్మించి ప్రమాదాల అరికట్టాలన్నారు. రంగదాంపల్లి అమరుల చౌరస్తా జాతీయ రహదారి పై నిత్యం వేలాది వాహనాల రాకపోకలు నడుస్తాయని ఈ క్రమంలోనే అమరవీరుల చౌరస్తా వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని హైదారాబాద్- కరీంనగర్ జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.