calender_icon.png 7 March, 2025 | 2:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ వలసదారుల తరలింపునకు యుద్ధ విమానాలు వద్దు..?

06-03-2025 11:31:56 PM

ఖర్చు తడిసి మోపెడవుతుండడంతో అగ్రరాజ్యం పునరాలోచన...

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసల నివారణ, వారి బహిష్కరణ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే అక్కడి ప్రభుత్వం అమెరికాలో అనధికారికంగా ఉంటున్న వారిని వారి సొంత దేశాలకు యుద్ధవిమానాల్లో పంపిస్తున్నది. అందుకు ఖర్చు తడిసి మోపడవుతుండడంతో యుద్ధ విమానాల వినియోగంపై అగ్రరాజ్యం పునరాలోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వరుసగా కథనాలు ప్రసారమవుతున్నాయి.

అమెరికా నుంచి గాటెమాలకు అక్రమ వలస దారులను పంపించేందుకు, ఒక్కో వ్యక్తికి ప్రభుత్వం 4,675 డాలర్ల చొప్పున ఖర్చు చేసినట్లు అంచనా. సాధారణ టిక్కెట్ ధరతో పొలిస్తే ఆ ఖర్చు ఐదు రెట్లు ఎక్కువ. మరోవైపు అమెరికా నుంచి అమృత్‌సర్‌కు రెండు యుద్ధవిమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసం అగ్రరాజ్యం ఒక్కో వ్యక్తిపై 10 వేల డాలర్ల (రూ.8.74 లక్షలు) చొప్పున వెచ్చించింది. ఛార్టెడ్ విమానాల కంటే, యుద్ధవిమానాలకయ్యే ఖర్చు చాలా ఎక్కువ. దీంతో అక్రమ వలసదారుల తరలింపు అంశంపై అగ్రరాజ్యం పునరాలోచిస్తున్నట్లు తెలిసింది.