- మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దే ఏం కోల్పోయామో
- ప్రజలకు అర్థమైంది
- రేవంత్ సర్కార్ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు
- ప్రభుత్వమంటే కూల్చడం కాదు.. నిర్మించడం నేర్చుకోవాలి
- బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): ‘రాష్ట్రంలో మళ్లీ బీఆర్ ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో వంద శాతం విజయం మనదే. భవిష్యత్‌లో ప్రతి మండలం, జిల్లా నుంచి బీఆర్‌ఎస్ వందశాతం గెలుస్తుందని ప్రజలు చెప్తున్నారు.
బీఆర్‌ఎస్‌ను ఓడించి ఏం కోల్పోయామో ప్రజలకు అర్థమైంది. రౌడీ పంచాయితీ చేయడం మాకూ తెలుసు. అరెస్టులకు భయపడేది లేదు. మనం హైరానా పడాల్సిన అవసరం లేదు’ అని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శనివారం ఎర్రవెల్లి పామ్‌హౌస్‌లో ఆయన పాలకుర్తి నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం అంటే ప్రజలందరిని కాపాడాలని, సమాజాన్ని నెలబెట్టి నిర్మాణం చేయాలి తప్ప కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడటం నాయకత్వం లక్షణాలు కావని ఆయన పరోక్షంగా హైడ్రా కూల్చివేతలను తప్పుబట్టారు. ప్రజలకు అధికారం ఇచ్చేది కూల్చడానికి కాదని, నిర్మించడానికి అనే సంగతి నేటి పాలకులు గుర్తుంచుకోవాలన్నారు.
మా పార్టీ నేతలకు తిట్లు బాగానే వచ్చని, వారు మొదలు పెడితే రేపటి వరకు ఆగకుండా తిట్టగలరని పేర్కొన్నారు. రౌడీ పంచాయతీ చేయడం తమకు కూడా తెలుసునన్నారు. ప్రజలను కాపాడాల్సిన పాలకులు భయపెట్టడం సరైన విధానం కాదని చెప్పారు. రాష్ట్ర ప్రజలు పాలన బాధ్యత రేవంత్‌రెడ్డికి అప్పగించారని, భాద్యతాయుతంగా సేవ చేయాలని సూచించారు.
అవినీతి పేరుతో కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తే తాము భయపడే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు. బీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు 10 శాతమేనని, అధికారం చేపట్టిన తరువాత 90 శాతం ఎవరూ అడగకున్నా పనులు చేసి అభివృద్ధిని ప్రజలకు చూపించామని తెలిపారు.
బీఆర్‌ఎస్ నాయకులు రేవంత్, ఆయన మంత్రుల బెదిరింపులకు భయపడవద్దని, వారి బెదిరింపులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పాలకులు ముందుగా ఎన్నికలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రైతులకు పెట్టుబడి సాయం, వృద్ధులకు ఆసరా పథకం అమలు చేయాలని సూచించారు.
తాను త్వరలో ప్రజలకు ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఊరు వాడా తిరిగి ఎండగడుతానని చెప్పారు. ఈ సమావేశంలో పాలకుర్తి బీఆర్‌ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన సినీ ప్రముఖులు
బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో సినిమా నిర్మాత పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, అర్టిస్టు రవితేజ ఆ పార్టీలో చేరారు. వారికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సినిమా పరిశ్రమకు బీఆర్‌ఎస్ పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని, భవిష్యత్తులో వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా తమ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.