calender_icon.png 14 October, 2024 | 3:47 AM

భయం లేదు.. బాధ్యత లేదు

14-10-2024 12:52:33 AM

సిటీ రోడ్లపై బైక్ స్టంట్లతో రెచ్చిపోతున్న ఆకతాయిలు

మాడిఫైడ్ సైలెన్సర్లతో విపరీత శబ్ధాలు

ర్యాష్ డ్రైవింగ్‌తో తోటి ప్రయాణికులకు ఇబ్బందులు

పోలీసులు దృష్టి సారించాలని ప్రజల డిమాండ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్ రోడ్లపై బైక్‌లతో ఆకతాయిలు హడలెత్తిస్తున్నారు. బైక్‌ల పై విన్యాసాలు చేస్తూ సాటి ప్రయాణికులను భయపెడుతున్నారు. వారి ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నారు. రాత్రయితే చాలు సిటీ రోడ్లపై హంగామా సృష్టిస్తున్నారు.

బైక్‌లకు మాడిఫైడ్ సైలెన్సర్లు ఏర్పాటు చేసుకొని విపరీతమైన సౌండ్‌లతో, ర్యాష్ డ్రైవింగ్‌తో దూసుకుపోతున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్‌లో బైక్ రేసింగ్ సంస్కృతి రోజురోజుకీ విస్తరిస్తోంది. సిటీతో పాటు శివారు ప్రాంతాలలోనూ తెల్లవారుజాము 1  నుంచి 4 గం టల వరకు రేసింగ్‌లు అధికంగా జరుగుతున్నట్లు సమాచారం.

భయం లేకుండా.. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతుం టే.. బైక్ రేసర్లను కట్టడి చేయడానికి స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నామని పోలీసులు చెప్ప డం గమనార్హం.  

ప్రమాదాల బారిన యువత

ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్‌ల వలన ఎం దరివో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి బైక్ రేసర్లను కట్టడి చేస్తుండగా.. కొన్ని రోజు లు సైలెంట్‌గా ఉండి మళ్లీ యథావిధిగా బైక్ రేసింగ్‌లు జరుపుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా మాడిఫైడ్ సైలెన్సర్లతో భీకర శబ్ధాలతో దూసుకుపోతున్న కార్లు, బైక్‌లపై ట్రాఫిక్ పోలీసులు, లా అండర్ ఆర్డర్ పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు.

రేసింగ్‌లు చేస్తూ పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరిచి, కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని, అయినా వారిలో అనుకున్న మేర మార్పు రావడం లేదని, బైక్ రేసింగ్‌లను కట్టడి చేయడంలో తమతో పాటు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు పాటించాలని, లేదంటే పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  

దృష్టి పెట్టాలి  

రాత్రి సమయాల్లో ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో లేకపోవడంతో బైకర్స్ మరింత రెచ్చిపోతున్నారు. ఇష్టారీతిన వాహనా లు నడిపి ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నారు. వీకెండ్ వస్తే చాలు బం జారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలతో పాటు ఓఆర్‌ఆర్, శివారు ప్రాంతాలలో మోత మోగిస్తున్నారు.

పోలీసులు కట్టడి చేసినా బైక్ రేసర్లలో మార్పు రావడం లేదు. పబ్‌ల లో అర్ధరాత్రి వరకు పీకల దాకా మద్యం తాగి, మాడిఫైడ్ సైలెన్సర్లతో బైక్ రేసింగ్‌లలో పాల్గొనే యువత మాదక ద్రవ్యా లు కూడా సేవిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత కొద్ది కాలం క్రితం రాయదుర్గం పోలీసులు  రేసులతో హల్‌చల్ చేస్తున్న బైకర్లపై చర్యలకు ఉపక్రమించారు.

రేసులు నిర్వహిస్తున్న 50 మందిని పట్టకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అడపాదడపా కాకుండా నిరంతరం బైక్ సైలెన్సర్, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్‌లపై పోలీసు లు నిరంతరం నిఘా పెట్టాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.