calender_icon.png 21 November, 2024 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూట్యూబ్ చానళ్లకు థియేటర్లలోకి నో ఎంట్రీ

21-11-2024 12:00:00 AM

యూట్యూబ్ ఛానెళ్లు ఇచ్చే రివ్యూలు సినిమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని భావించిన కోలీవుడ్ నిర్మాతల మండలి కొరడా ఝుళిపించింది. ఇకపై థియేటర్లలోకి యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులకు నో ఎంట్రీ అంటూ హెచ్చరించింది. థియేటర్ల ముందు యూట్యూబ్ ఛానళ్లు నెగెటివ్ రివ్యూలు ఇవ్వడంతో ఈ ఏడాది చాలా తమిళ్ సినిమాలు సాధారణ కలెక్షన్లు కూడా రాబట్టలేదు.

కమల్ హాసన్ ‘ఇండియన్ 2’పై యూట్యూబ్ ఛానెళ్లు థంబ్ నెయిల్స్‌తో సినిమాను దారుణంగా ట్రోల్ చేశాయి. ఫలితంగా ఆ చిత్రం ఆల్ టైమ్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇటీవల విడుదలైన రజనీకాంత్ ‘వేట్టయన్’ పరిస్థితీ అదే. తాజాగా సూర్య ‘కంగువ’ గురించి ఓవర్సీస్ టాక్‌ను ఆధారంగా చేసుకుని తమిళ్‌లో మొదటి ఆట ముగియకుండానే పబ్లిక్ టాక్ పేరుతో యూట్యూబ్ ఛానళ్ల వారు ఈ చిత్రాన్ని చీల్చి చెండాడారు.

ఇలా సినీ పరిశ్రమకు తలనొప్పిగా మారుతున్న ఈ సమస్యను నివారించేందుకు తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూట్యూబ్ ఛానళ్లను సినిమా హాళ్ల ప్రాంగణంలోకి అనుమతించకూడదని, ఫస్ట్ డే థియేటర్ దగ్గర పబ్లిక్ రివ్యూలకు చెప్పే వెసులుబాటు ఇవ్వొద్దని థియేటర్ ఓనర్స్‌కు సూచిస్తూ నోట్ రిలీజ్ చేసింది. ఇకపై అలా చేస్తే చూస్తూ ఉరుకునేది లేదంటూ హెచ్చరించింది. 

తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు తరహా రూల్స్: దిల్ రాజు 

‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రెస్‌మీట్‌లో నిర్మాత దిల్ రాజు కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్ణయంపై స్పందించారు. కేరళ, తమిళనాడులో తీసుకున్న నిర్ణయాలు తెలుగులోనూ ఇంప్లిమెంట్ అవుతాయన్నారు. ‘సినిమా రివ్యూల విషయంలో కేరళలో ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ తమిళనాడులోనూ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చారు. నాక్కూడా ఈ రూల్స్ పంపించారు.

అక్కడ తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఆటోమేటిక్‌గా మన రాష్ర్టంలోనూ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ నిర్ణయం ఫిల్మ్ ఛాంబర్ ద్వారా జరుగుతుంది. ఎగ్జిబిటర్స్ కూడా దానికి ప్రిపేర్ అయినట్లు తెలుస్తున్నది. త్వరలోనే ఛాంబర్ ద్వారా రివ్యూల విషయంలో కీలక నిర్ణయం వస్తుంది’ అని దిల్ రాజు వెల్లడించారు.