calender_icon.png 30 October, 2024 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రాగన్‌కు నో ఎంట్రీ

31-07-2024 03:04:34 AM

చైనా పెట్టుబడులపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: పొరుగు దేశం చైనానుంచి పెట్టుబడుల విషయంలో కేంద్రం తన వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. ఆ దేశం నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో పునరాలోచించే ఉద్దేశమేదీ లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. బడ్జెట్‌కు ముం దు ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో చైనా పెట్టుబడుల గురించి ప్రస్తావించిన నేపథ్యంలో గోయల్ ఈ విధంగా స్పందించారు. ఆర్థిక సర్వే తన కొత్త ఆలోచనలను, సొంత అభిప్రాయాలను ప్రస్తావిస్తుందని పేర్కొన్నారు.

దానికి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టుబడబోదని, చైనా పెట్టుబడులను ప్రోత్స హించే ఆలోచన లేదని మంత్రి వెల్లడించారు.బడ్జెట్‌కు ముందు రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో చైనా పెట్టుబడుల ప్రస్తావన వచ్చింది. చైనా నుంచి ఎఫ్‌డీఐలతో దేశీయంగా తయారీని పెంచవచ్చని, తద్వారా ఇక్కడి నుంచి విదేశాలకు వస్తువులను ఎగుమతి చేయొచ్చని పేర్కొంది. అమెరికా,- యూ రప్ వంటి దేశాలు చైనాకు ప్రత్యామ్నాయమని చూస్తున్న వేళ ఆ ప్రయోజనాన్ని పొం దొచ్చని పేర్కొంది. చైనా పెట్టుబడులను ఆహ్వానించి ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయ డం మెరుగైన ఆలోచనగా సర్వే అభిప్రాయపడింది. కాబట్టి చైనా ఎఫ్‌డీఐలను ప్రోత్స హించాలని పేర్కొంది.

అయితే గల్వాన్ లోయలో 2020లో భారత్,- చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ కారణంగా ఆ దేశంతో సంబంధాలు క్షీణించాయి. దీంతో టిక్ టాక్, వియ్ చాట్ వంటి 200 యాప్‌లను భారత్ నిషేధించింది. ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ నుంచి వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలనూ భారత్ తిరస్కరించింది. ఆ దేశం నుంచి ఎఫ్‌డీఐ నిబంధనలనూ కఠినతరం చేసింది. చైనాతో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలకు ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేసింది. ఈ క్రమంలోనే ఎంజీ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో జేఎస్‌ఈబ్ల్యూ గ్రూప్ 38 శాతం వాటా కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది.

ఓ వైపు చైనాతో ఘర్షణ పూరిత వాతావరణం ఉన్నా.. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనానే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం విలువ 118.4 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం. ఇందులో దిగుమతుల విలువ సుమారు 101.7 బిలియన్ డాలర్లు. దీంతో రోజురోజుకూ ఆ దేశంతో వాణిజ్య లోటు పెరుగుతూ వస్తోంది. ఇదే అంశాన్ని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. అయితే, సోలార్ ప్యా నెళ్లు, బ్యాటరీల తయారీ విషయాల్లో చైనా పెట్టుబడి నిబంధనలను ప్రభుత్వం సరళీకరించొచ్చంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో పీయూష్ గోయల్ తన స్పందనను తెలియజేయడం గమనార్హం.