calender_icon.png 28 September, 2024 | 3:05 AM

దుర్గాపూజ సెలవులు వద్దు

27-09-2024 12:47:13 AM

  1. బహిరంగంగా పూజలు నిర్వహించొద్దు
  2. బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ వాదుల హెచ్చరిక

ఢాకా, సెప్టెంబర్ 26: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశంలోని మైనారిటీలపైన మొదలైన దాడులు, అణచివేతల పరంపర కొనసాగుతూనే ఉన్నది. తాజాగా బెంగాల్, బంగ్లాదేశ్‌లో హిందువులకు అతిపెద్ద పండుగ అయిన దుర్గా పూజపై కూడా ఛాందసవాదులు ఆంక్షలు విధిస్తున్నారు. ఏటా దుర్గా పూజ సందర్భంగా బంగ్లాదేశ్‌లో జాతీయ సెలవు ప్రకటించటం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి దుర్గా పూజకు సెలవు ఇవ్వటానికి వీల్లేదని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

హిందువులు దుర్గాపూజను బహిరంగంగా కూడా నిర్వహించుకోవటానికి వీళ్లేదని హెచ్చరించారు. ఢాకాలోని సెక్టార్ 13లో ఏటా దుర్గా పూజ ఉత్సవాలు నిర్వహించే మైదానంలో ఇకపై పూజలు నిర్వహించరాదని ఇటీవల పలు ఇస్లామిక్ అతివాద సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించి హెచ్చరికలు జారీచేశాయి. ‘రోడ్లు బంద్ చేసి ఎక్కడా పూజలు నిర్వహించరాదు.. విగ్రహాలను నిమజ్జనం చేసి ఎక్కడా నీటిని కలుషితం చేయకూడదు.

విగ్రహారాధన ఎక్కడా చేయకూడదు’ అని ఇన్సాఫ్ కీమ్‌కారీ ఛాత్ర జనతా అనే సంస్థ ఇటీవల నిర్వహించిన ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శించారు. హిందువుల పండుగలపై ఆంక్షలు విధించే 16 డిమాండ్లను ఆ సంస్థ ప్రభుత్వం ముందుంచింది. ‘బంగ్లాదేశ్‌కు భారత్ జాతీయ శత్రువు అయినందున.. బంగ్లాదేశ్‌లోని హిందువులు కచ్చితంగా భారత వ్యతిరేకతను చాటుకోవాలి. వారి ఆలయాల్లో భారత వ్యతిరేక బ్యానర్లు ఏర్పాటుచేయాలి. భారత వ్యతిరక నినాదాలివ్వాలి’ అని ఆ డిమాండ్లలో పేర్కొన్నది.