మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
మానకొండూర్ జనవరి 21 విజయ క్రాంతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న 4 కొత్త పథకాలపై ఎలాంటి సందేహాలు వద్దని, అర్హులకే పథకాల ద్వారా లబ్ధిచేకూరుస్తామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు.
మంగళవారం కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం లక్ష్మీపూర్లో ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి 6 గ్యారంటీ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సమాయత్తమైందన్నారు. ఇప్పటికే మహిళల కు ఉచిత బస్సు, రూ.500 గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ సాయం రూ.10లక్షలకు పెంపుతోపాటు రైతులకు రుణమాఫీ, చేశామన్నారు ఈనెల 26 గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తామన్నారు.
లక్ష్మీపూర్‌లో నిర్వహిస్తున్న గ్రామసభను అడ్డుకునేందుకు కొంత మంది బీఆర్‌ఎస్ నాయకులు ప్రయ త్నించారు. అయితే బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ చేపట్టిన పథకాలపైన, ఎన్నికల హామీలపైన ప్రశ్నలు సంధించగా, సభలో ఉన్న ఎమ్మెల్యే వారికి తగిన సమాధానాలు చెప్పారు.
అంతే కాకుండా వారి సందేహాలన్నింటినీ ఆయన నివృత్తి చేయడంతో వికసించని గులాబీ,లు సభ నుంచి జారుకున్నారు. ఈ గ్రామసభలో మండల పరిషత్ అభివృద్ధి అధికారితోపాటు బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.