calender_icon.png 24 March, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో 25 ఏండ్ల దాకా డీలిమిటేషన్ వద్దు

23-03-2025 01:20:08 AM

సమాఖ్యవాదానికి ముప్పు: తమిళనాడు సీఎం స్టాలిన్ 

సుప్రీంలో పోరుకు సిద్ధమైన ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 

చెన్నైలో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం

  1. దీన్ని ఎప్పటికీ అనుమతించొద్దు: కేరళ సీఎం పినరయి విజయన్ 
  2. హిందీయేతర రాష్ట్రాలకు నష్టం: పంజాబ్ సీఎం మాన్ 
  3. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై 
  4. అఖిలపక్ష నేతలు నిజంగానే ఆందోళన చెందుతున్నారా?: ఆర్‌ఎస్‌ఎస్ నేత అరుణ్ కుమార్

చెన్నై, మార్చి 22: డీలిమినేటషన్‌ను 1971 జనాభా లెక్కల ఆధారంగా మరో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని జాయిం ట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. డీలిమిటేషన్‌లో పారదర్శక తను డిమాండ్ చేస్తూ 25ఏళ్లపాటు వాయి దా వేయాలనే తీర్మానానికి జేఏసీ ఆమోదం తెలిపింది.

జనాభా ఆధారిత డీలిమిటేషన్‌కు వ్యతిరేకిస్తూ న్యాయబద్ధమైన డీలిమిటేషనే లక్ష్యంగా సీఎం స్టాలిన్ నాయకత్వంలో చెన్నైలోని జమక్కల్ కవింగ్నర్ హాల్ వేదికగా శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిది స్టాలిన్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మొత్తం 123 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తాజా భేటీని ‘జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ఫెయిర్ డీలిమిటేషన్’గా పిలుద్దామని స్టాలిన్ ప్రతిపాదించగా నేతలు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మొత్తం 7 ముఖ్యాంశాలతో కూడిన తీర్మాన ముసాయిదాను డీఎంకే పార్లమెంటరీ నేత కనిమొళి చదివి వినిపించగా జేఏసీ దానికి ఆమోదం తెలిపింది.

అలాగే కేంద్ర ప్రభు త్వం తమ ఆందోళనలను పరిగణలోకి తీసుకోకుండా జనాభా ఆధారిత డీలిమిటేషన్‌పై మొండిగా ముందుకు వెళ్తే ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం కోర్టులో పోరాడాలని పంజాబ్ సహా బీజేపీయేతర దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. 

సమాఖ్యవాదానికి ముప్పు

జనాభా ఆధారిత డీలిమిటేషన్ వల్ల చట్టాల రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుందని అఖిలపక్ష సమావేశంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. జనాభా ఆధారిత డీలిమిటేషన్ వల్ల సమాఖ్యవాదానికి ముప్పు వాటి ల్లుతుందని పేర్కొన్నారు. సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిలిగిపోతామని పేర్కొన్నారు.

పార్ల మెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గిపోతే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం పోరా టం చేయాల్సి వస్తుందన్నారు. మన సమ్మతితో సంబంధం లేకుండానే చట్టాలు రూ పొందే అవకాశం ఉందనీ.. దీంతో దక్షిణాది ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు.

విద్యార్థులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము డీలిమిటేషన్‌కు వ్యతిరేకం కాదని, న్యాయబద్ధమైన డీలిమిటేషన్‌ను డి మాండ్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అంతేకాకుండా డీలిమిటేషన్‌పై ఈ అఖిలపక్ష భేటీ చరిత్రాత్మకంగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.

మనం ఎప్పటికీ అనుమతించొద్దు

ఎలాంటి చర్చలు జరపకుండానే డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. ఒక వేళ ఇదే జరిగితే అది మనకు డేంజర్ బెల్ లాంటిదేనని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం తగ్గితే.. దేశ సంపదలో మన వాటా కూడా తగ్గుతుందనీ అందువల్ల దీన్ని ఎప్పటికీ అనుమతించకూడదన్నారు.  

హిందీ మాట్లాడే రాష్ట్రాలకే ప్రయోజనం

కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న డీలిమిటేషన్ వల్ల హిందీ మాట్లాడే రాష్ట్రాలకే ప్రయోజనం చేకూరుతుందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. తా ము పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతున్న రాష్ట్రాల్లో సీట్లను తగ్గించాలని బీజేపీ భావిస్తోందని విమర్శించారు. తమకు అనుకూ లంగా ఉన్న  రాష్ట్రాల్లో సీట్ల వాటాను పెంచడమే బీజేపీ ఎజెండా అని ఆరోపించారు.  

ఏటీఎం యంత్రాల్లా దక్షిణాది రాష్ట్రాలు

దక్షిణాది రాష్ట్రాలను ఉత్తరాదికి ఏటీఎం యంత్రాలుగా పరిగణిస్తున్నారని, అయినప్పటికీ ఇక్కడి రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం ముప్పులో ఉందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ రాజ్యాంగ హామీలకు విరుద్ధమని పేర్కొన్నారు.

జనాభా ఆధారిత డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయ దాడిగా ఆయన అభివర్ణిం చారు. జనాభా పెరుగుదలను నియంత్రించి, దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే దక్షిణాది రాష్ట్రాలను ఇది శిక్షించడమేనన్నారు. ఏటా కేంద్రానికి కర్ణాటక నుంచి 4లక్షల కోట్లు వెళ్తున్నా.. కేంద్రం నుంచి చాలా తక్కువ నిధులు రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయన్నారు. 

జనాభా ప్రామాణికంగా ఉండొద్దు

పార్లమెంటులో ప్రాతినిధ్యానికి జనాభా ను ప్రామాణికంగా తీసుకోవడం అన్యాయమని నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.  వర్చువల్‌గా హాజరైన ఆయన.. జనాభాను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించరాదన్నారు. జనాభాను నియంత్రించకపోతే దేశంలో జనాభా విస్పోటం జరిగి, అభివృద్ధి దెబ్బతినేదన్నారు. 

ఇది క్లిష్టమైన క్షణం

కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత డీలిమిటేషన్ వల్ల కొన్ని రాష్ట్రాలు పార్లమెంటులో తమ హక్కులను, వాణిని కోల్పోతాయని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉధయనిధి స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని క్లిష్టమైన క్షణంగా అభివర్ణించారు. కుటుంబ నియంత్రణ విధానాలను విజయవంతంగా అమ లు చేసిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శిక్ష విధించాలని చూస్తోందని ఆరోపించారు.

గ త ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణల ద్వారా డీలిమిటేషన్‌ను రెండుసార్లు వాయిదా వేసినట్టు గుర్తు చేశారు. ఈ గడువు 2026 నాటి కి ముగుస్తుంన్నందున మరోసారి గడువు పొడగిస్తుందా లేదా అనేదానిపై స్పష్టత కరువైందని అసహనం వ్యక్తం చేశారు. 

తీర్మానంలోని ముఖ్యాంశాలు

* గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన 42,84, 87 రాజ్యాంగ సవరణల ఉద్దే శం జనాభా నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలను ప్రోత్సహించడం. జనాభా స్థిరీకర ణ లక్ష్యం ఇంకా నెరవేరనందున 1971 జ నాభా లెక్కల ఆధారంగా మరో 25 ఏళ్లపాటు డీలిమిటేషన్‌ను నిలిపివేయాలి.

* ప్రజాస్వామ్య స్వభావాన్ని మెరుగుపర్చడానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించే డీలిమిటేషన్ పారదర్శకంగా ఉండాలి. అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర వాటాదారులతో సంప్రదింపులు జరగాలి.

* జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని స మర్థవంతంగా అమలు చేసి, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించకూడ దు. ఇందుకోసం కేంద్రం అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయాలి. 

* పైన పేర్కొన్న సూత్రాలకు విరుద్ధంగా కేంద్రం డీలిమిటేషన్ కసరత్తు చేస్తే, ఆ ప్రయత్నాలను ఎదుర్కోవడానికి, జేఏసీ లో భాగస్వామ్యంగా ఉన్న రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులతో కూడిన కోర్ కమిటీ పార్లమెంటరీ వ్యూహాలను సమన్వయం చేస్తుంది. 

* ఎంపీల కోర్ కమిటీ ఈ పార్లమెంట్ సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీకి  ఉమ్మడి మెమోరాండాన్ని సమర్పిస్తుంది. 

* సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఈ అంశంపై తమ తమ రాష్ట్రాల్లోని అసెంబ్లీల్లో తీర్మానం కోసం ఒత్తిడి చేసి, తమ వైఖరిని కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేస్తాయి. 

* డీలిమిటేషన్ చరిత్ర, దాని పరిణామాల గురించి పౌరులకు అవగాహన కల్పించ డం కోసం జేఏసీ పెద్ద ఎత్తున ప్రచారా న్ని నిర్వహిస్తుంది. 

నిజంగానే ఆందోళన ఉందా?

డీలిమిటేషన్‌పై అఖిలపక్ష నేతలు నిజంగానే ఆందోళన చెందుతున్నారా? లేక రాజకీయ ప్రయోజనం కోసం చర్చల్లో పాల్గొన్నారా? అని ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా చెన్నై వేదిక గా జరిగిన అఖిలపక్ష సమావేశంపై ఆయన స్పందించారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ..

కేంద్ర ప్రభుత్వం ఇంకా డీలిమిటేషన్‌ను ప్రారంభించనందున ఇలాంటి చర్చలకు దూరం గా ఉండాలని అఖిలపక్ష నేతలకు సూచించారు.  డీలిమిటేషన్‌పై చర్చల్లో పాల్గొంటున్న వాళ్లు తమ రాజకీయ ఎజెండా కోసం చర్చల్లో పాల్గొన్నారా? నిజంగానే తమ ప్రాంత ప్రయోజనాల కోసం చర్చల్లో పాల్గొన్నారా? అనే విషయంపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నా రు. డీలిమిటేషన్‌పై కేంద్రం చర్య లు ప్రారంభించిందా? అని స్టాలిన్‌ను ప్రశ్నించాలని మీడియాకు సూచించారు. 

ప్రజల దృష్టి మరల్చేందుకే..

అంతర్రాష్ట్ర వివాదాలు, ప్రభుత్వ అవినీతి, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే డీలిమిటేషన్ మీటింగ్ పే రుతో స్టాలిన్ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. స్టాలిన్ నాయకత్వంలో చెన్నై వేదికగా శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ నల్లజెండాలతో నిరసన తెలిపింది. 

అన్నామలై నల్ల చొ క్కాను ధరించి, తన ఇంటి ముందే నిరస న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పోరేషన్ స్కాం, రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నాన్ని సీఎం చేస్తున్నారని విమర్శించారు. కర్ణాటకతో ఉన్న కావేరి జలాల వివాదం, కేరళతో ఉన్న చెత్త డం పింగ్ వివాదం వంటి రాష్ట్ర సమస్యలను సీఎం విస్మరించారని దుయ్యబట్టారు.