మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారి ఆనుకొని ఉన్న అంబేద్కర్ విగ్రహం మరో చోటికి తరలింపు విషయం లో ఏకాభి ప్రాయం కుదరలేదు. ఈ విషయమై అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులతో మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో అంబేద్కర్ విగ్రహాన్ని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తరలించే ముందు మళ్లీ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేందుకు స్థలం, గద్దె నిర్ణయించాలని అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. గతంలో అథ్వెల్లి వద్ద తొలగించిన విగ్రహాలను మళ్లీ పునర్ ప్రతిష్టించకుండా అవి ఎక్కడ పెట్టారో ఎవరికి అర్థంకావడం లేదని, ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే ముందు స్థల సేకరణ కావాలని అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు అన్నారు. దీంతో సమావేశం అద్దాంతరంగా ఆగిపోయింది. సమావేశంలో ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి, సీఐ సత్యనారాయణ, ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ పాల్గొన్నారు.