calender_icon.png 19 April, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిహారం వద్దు..పెన్షనే కావాలి

05-07-2024 01:41:52 AM

అగ్నివీర్ పథకంపై అమరసైనికుడి కుటుంబం

న్యూఢిల్లీ, జూలై 4: సైన్యంలో ప్రవేశాలకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తుతున్న వేళ.. మాజీ సైనికుల కుటుంబాలు కూడా ఈ పథకంపై వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నాయి. లుథియానాకు చెందిన అగ్నివీర్ అజయ్‌కుమార్ కుటుంబం తమకు ప్రభుత్వం ఇచ్చే డబ్బు వద్దని, పెన్షన్‌తోపాటు క్యాంటీన్ కార్డు కావాలని డిమాండ్ చేసింది. అజయ్‌కుమార్ నాలుగేండ్లు సైన్యంలో పనిచేసి విధుల్లో వీరమరణం పొందాడు. అగ్నివీర్ పథకం ప్రకారం అతనికి రూ.1 కోటి పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ పరిహారాన్ని అతని కుటుంబం వ్యతిరేకిస్తున్నది.

ప్రభుత్వం ఇచ్చే డబ్బు తన సోదరుడికి ప్రత్యామ్నాయం అవుతుందా అని అతడి సోదరి సూటిగా ప్రశ్నించారు. ‘అగ్నివీర్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. మాకు పెన్షన్ ఇవ్వాలి. క్యాంటీన్ కార్డు కూడా ఇవ్వాలి. నా సోదరుడికి సైన్యం ‘హీరో’ గుర్తింపు ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో అజయ్‌కుమార్ లేకుండా అతని కుటుంబం ఒంటరిగా బతకగలదా?’ అని ఆమె ప్రశ్నించారు.  అగ్నివీర్ పథకంలో భాగంగా విధుల్లో చనిపోయిన సైనికుల కుటుంబాలకు రూ.98 లక్షలు ఇస్తున్నామని సైన్యం ప్రకటించిందని, కానీ తన కుటుంబానికి రూ.48 లక్షలు మాత్రమే అందాయని అజయ్‌కుమార్ తండ్రి తెలిపారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావటంతో సైన్యం స్పందించింది. విధుల్లో చనిపోయిన అగ్నివీర్ల కుటుంబాలకు రూ.98 లక్షలు చెల్లిస్తున్నామని సైనిక ప్రతినిధి తెలిపారు. అజయ్‌కుమర్ కుటుంబానికి కూడా రూ.98 లక్షలు ఇచ్చామంని చెప్పారు.