09-04-2025 01:05:26 AM
నిపుణులతో చర్చించాకే అదనపు పోస్టులు సృష్టించారు
న్యాయపరమైన జోక్యం అవసరం లేదు: సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా
మమతా బెనర్జీ సర్కారుకు స్వల్ప ఊరట
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : ఉపాధ్యాయుల నియామక కుంభకోణం కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అదనపు టీచర్ పోస్టుల సృష్టికి రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
నిపుణుల కమిటీతో చర్చించిన తర్వాతే బెంగాల్ విద్యాశాఖ అదనపు పోస్టులను సృష్టించిందని తెలిపింది. అదనపు టీచర్ల నియామకాలపై గవర్నర్ ఆమోదం కూడా లభించిందని, ఇప్పు డు న్యాయపరమైన జోక్యం అవసరం లేదని వెల్లడించింది. దీనిలో భాగంగా సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని పక్కనబెడుతున్నట్టు పేర్కొంది.
అయితే టీచర్ల నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన ఇతర అంశాలు, ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు యథావిధిగా కొనసాగు తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. 2016లో పశ్చిమ్ బెంగాల్ సర్కారు ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతోపాటు గ్రూప్ గ్రూప్ స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం రాష్ట్రస్థాయి సెలెక్షన్ పరీక్ష నిర్వహించింది.
24, 650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన రిక్రూట్‌మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఎంపిక ప్రక్రియ చేపట్టి 25, 753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. అయితే ఖాళీలు ఉన్న సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎంపిక చేయడంపై వివాదం రాజుకుంది. దీంతో ఉద్దేశపూర్వకంగా అదనపు పోస్టులను సృష్టించి అక్రమ నియామకాలు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి.
ఈ ఆరోపణలు కొనసాగుతుండగానే 2022 మే 19న మమతా ప్రభుత్వం సూపర్‌న్యూమరీ టీచర్ల పేరిట మరో నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు ఇవ్వడంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు 2016 నాటి నియామక ప్రక్రియ చెల్లదని తీర్పు వెలువరించింది.
అంతేగాక కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రతో పాటు అవకతవకలపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం అదనపు ఉద్యోగాల సృష్టిపై దర్యాప్తు అవసరం లేదంటూ తీర్పు వెలువరించడంతో దీదీ ప్రభుత్వానికి స్వల్ప ఊరట దక్కినట్టయింది.