calender_icon.png 12 October, 2024 | 6:59 AM

కుల వ్యవస్థ వద్దు

12-10-2024 02:27:47 AM

అన్ని కులాల పిల్లలకు ఒకటే స్కూలు

  1. అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం
  2. విద్యావ్యవస్థను ధ్వంసంచేసిన గత సర్కారు
  3. నాటి ప్రభుత్వ హయాంలో 5 వేల స్కూళ్లు మూత
  4. పేదలకు విద్య అందిస్తే ప్రశ్నిస్తారని కేసీఆర్‌కు భయం
  5. ఎస్సీ, ఎస్టీల పిల్లలు గొర్రెలు, బర్రెలు కాయలా? 
  6. 1023 గురుకులాలు పెట్టినా స్వంత భవనాలు కట్టలే
  7. 33 జిల్లాల్లో బీఆర్‌ఎస్‌కు మాత్రం కోటలు కట్టారు 
  8. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శలు
  9. కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన

రంగారెడ్డి, ఆక్టోబర్ (విజయక్రాంతి): కుల అంతరాలు లేని తెలంగాణ సమాజం కోసం తమ ప్రభుత్వం కృషిచేస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని కులాల పిల్లలు ఒకేచోట కలిసి చదువుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

కులాల అంతరాలు తొలగిపోయి అన్ని కులాల విద్యార్థులు ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకొనేంత ఆప్యాయతలు పెరిగేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. 

ఇం టిగ్రేటెడ్ స్కూళ్లను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది నిరుపేద విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు. ప్రపంచమంతా తెలంగాణ గురుకుల విద్య వైపు చూసేలా తీర్చి దిద్దుతామని హామీనిచ్చారు. 

విద్యా వ్యవస్థను ధ్వంసం చేసిన గత ప్రభుత్వం

గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని, నిరుపేదలకు విద్యను దూరం చేసే కుట్రలకు నాటి సీఎం కేసీఆర్ తెరలేపారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. నిరుపేద లకు విద్య అందితే వారిలో ప్రశ్నించే తత్వం అలవడుతుందనే ఉద్దేశంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా ఆయన పేదలకు గొర్రెలు, బర్రెలు కాసుకొనే పథకాలు తీసుకొచ్చారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో రూ.22 లక్షల కోట్ల బడ్జె ట్‌ను ఖర్చు చేసిన కేసీఆర్ విద్యకు రూ.10 వేల కోట్లను కూడా ఖర్చు చేయలేకపోయారని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా 5 వేల స్కూళ్లు మూతపడ్డాయని విమర్శించారు.  ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య, వైద్యం అందించి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు విద్యాశాఖను తనవద్దే ఉంచుకొన్నట్లు చెప్పారు. ఎవరితోనైనా చెలగాటం ఆడొచ్చుకానీ టీచర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. టీచర్లు ఎన్నికల సమయం లో ప్రభుత్వ పనితీరుపై ఓటు ద్వారా మార్పు చూపిస్తారని చెప్పారు. తమ ప్రభుత్వం 34 వేల మంది టీచర్లను బదిలీ చేసి, 21వేల మంది టీచర్లకు పదోన్నత్తులు కల్పించామన్నారు. 

పీవీ దూరదృష్టితో గురుకులాలకు బీజం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో 1972లో మునుగోడు నియోజకవర్గం సర్వేల్‌లో గురుకుల విద్యకు బీజం పడిందని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుత పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, మాజీ డీజీపీలాంటి వారు అక్కడే చదివి ఉన్నతస్థాయికి చేరారని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభు త్వం గురుకులాలు పెట్టకపోతే బుర్రా వెంకటేశం కుల వృత్తి చేసుకొంటూనో లేక చిరు ఉద్యోగం చేసుకొంటూనే బతికేవారని అన్నారు. కింది కులాలవారిని కూడా ఉన్నతస్థాయికి తెచ్చేందుకు ఓకే ప్రాంగణంలో అంతర్జాతీయస్థాయిలో గురుకులాల ఏర్పాటుకు పూనుకొన్నట్లు తెలిపారు.

20 నుంచి 25 ఎకరాల్లో రూ.125 నుంచి రూ.150 కోట్లతో ఒక్కో గురుకులాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. ప్రపంచాన్ని ఏలే తెలివితేటలు తెలంగాణ ప్రజలకు ఉన్నాయని అన్నారు. సభలో మణికంఠ, శృతి అనే విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ విద్య గురించి మాట్లాడిన తీరును సీఎం అభినందించారు.  

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై నాకు ప్రత్యేక గౌరవం

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అంటే తన కు ప్రత్యేక గౌరవం అని సీఎం అన్నారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి వచ్చి ఐపీఎస్‌గా గురుకులాల కార్యదర్శిగా పనిచేశాడని గుర్తు చేశారు. ఆయన రాజకీయంగా బీఎస్పీలో ఉన్నా, బీఆర్‌ఎస్‌లో ఉన్నా తనకు అభ్యంతరం లేదని, కాకపోతే ఆయన కూడా దొర పార్టీలోకి వెళ్లి దొర మాటలే మాట్లాడటం కొంత బాధాకరమని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తుంటే ప్రవీణ్‌కుమార్ ఎందుకు తప్పుపడుతున్నారని ప్రశ్నించారు. ఏ దొరలైతే ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు విద్య, వైద్యాన్ని దూరం చేశారో.. ఆ దొరల పక్కనే చేరి.. తాము ఆ వర్గాల ప్రజలకు మంచి చేస్తుంటే విమర్శిస్తారా అని నిలదీశారు.

కేసీఆర్ చెప్పినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు కులవృత్తులు చేసుకొంటూ గొర్రెలు, మేకలు కాసుకుంటూ బతకాలా అని మండిపడ్డారు.  ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా బీఆర్‌ఎస్ నేతలకు బుద్ధిరావడం లేదని ఎద్దేవా చేశారు. నాటి ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుచేసి ప్రగతిభవన్ నిర్మించుకొంటే.. తాము నిరుపేద విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ గురుకులాలు నిర్మిస్తున్నామని తెలిపారు.

తాము అధికారంలోకి రాగానే 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీచేశామని అన్నారు. తన కుటుంబ సభ్యులే రాజ్యాలు ఏలాలన్నదే కేసీఆర్ అభిమతమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమ ని.. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కను తమ ప్రభుత్వంలో మంత్రులుగా చేశామని చెప్పారు.

గత ప్రభుత్వంలో 1,023 గురుకులాలు ఏర్పాటుచేసినా కనీస మౌ లిక వసతులు కల్పించలేదని, సొంత భవనాలు కూడా నిర్మించలేదని దుయ్యబట్టారు. 33 జిల్లాలో బీఆర్‌ఎస్  కార్యాలయా లను గడీల్లాగా కట్టుకొన్నారని ఆరోపించారు.

అంతకుముందు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ షాద్‌నగర్ నియోజకవర్గానికి మెడికల్ కళాశాల మంజురూ చేయాలని, లక్ష్మిదేవిపల్లి వద్ద  ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని, అభివృద్ధి పనుల కు నిధులు కేటాయించాలని కోరారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మండలిలో చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, పాఠశాల విద్యశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.