నిందితుల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదు
ఆక్రమణలకు ఈ ఆదేశాలు వర్తించవు
చివరి తీర్పులో స్పష్టం చేసిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ, నవంబర్ 10: చట్టబద్ధమైన పాలన జరుగుతున్న సమాజంలో బుల్డోజర్ న్యాయం ఆమోదయోగ్యం కాదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణకు ముందు తన చివ రి తీర్పులో పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా పౌరుల గొంతు నొక్కడం సరికాదన్నారు. ప్రజల నివాసాల రక్షణ, భద్రత వారి ప్రాథమిక హక్కుల కిందకు వస్తాయని తెలిపారు. వాటిని కూల్చే అధికారం ప్రభుత్వాలకు ఉండదని చెప్పారు. ఏ అధికారైనా ప్రజల నివాసం కూల్చేందుకు అనుమతి ఇస్తే ఆ అధికారిపైనా చర్యలు తీసుకోవాలన్నారు.
అయితే, ఈ ఆదేశాలు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు వర్తించవని స్పష్టం చేశారు. కానీ, అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు కూడా ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ ప్రాంతంలోని ఓ ఇంటిని 2019లో అధికారులు నేలమట్టం చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన సీజేఐ నవంబర్ 6న తీర్పు వెల్లడించారు. నేరగాళ్ల ఇళ్లు, ప్రైవేటు ఆస్తులపైకి బుల్డోజర్లు పంపిం చి వాటిని నేలమట్టం చేసే ధోరణి తొలుత యూపీలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ విధానం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది.
ఈ క్రమంలో నిందితుల ఆస్తులపై బుల్డోజర్లు పంపించడాన్ని సుప్రీం కోర్టు ఇప్పటికే పలుమార్లు తప్పు బట్టింది. కాగా, జస్టిస్ డీవై చంద్రచూడ్ దాదాపు రెండేళ్లు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తంచి నవంబర్ 10 పదవీ విరమణ పొందారు.
లాయర్ల ప్రశంసల వర్షం
భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి జస్టిస్ డీవై చంద్రచూడ్ అంకితభావంతో పని చేశారని పలువురు లాయర్లు పేర్కొన్నారు. ఈ ఫైలింగ్, వర్చువల్ హియరింగ్, డిజిటల్ కోర్టు వంటి సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. న్యాయవ్యవస్థకు సాంకేతికతను జోడించి సేవల్ని విస్తృత పరిచారన్నారు. బార్ అసోసియేషన్‌కు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపినట్లు పేర్కొన్నారు. కోర్టు పని తీరును మెరుగుపరచడానికి రిజిస్ట్రార్లను నేరుగా ఆయనే పిలిచి పలు సమస్యలపు పరిష్కరించిన సందర్భాలను కొందరు లాయర్లు గుర్తు చేసుకున్నారు.