calender_icon.png 21 November, 2024 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవనాల్లేవు.. ఫ్యాకల్టీ లేదు!

05-11-2024 02:05:36 AM

  1. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 16 నర్సింగ్ కళాశాలలు 
  2. కేవలం ప్రిన్సిపాల్స్ నియామకం మాత్రమే పూర్తి

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): ‘ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం’ అన్న చందంగా మారింది వైద్యావిద్యా విభాగం పనితీరు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే 16 నర్సింగ్ కళాశాలలకు భవనాల కేటాయింపు జరుగకముందే అడ్మిషన్లు ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే అంశంపై వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ అలెర్ట్ చేసినా యంత్రాంగం పట్టించుకోని పరిస్థితి. ఒక్క ప్రిన్సిపాల్స్ నియామకం తప్ప ఫ్యాకల్టీ, ఇతర సిబ్బంది నియామకం ఊసే లేదు. దీంతో మెడికల్ కళాశాలలు, జిల్లా, ఏరియా హాస్పిటళ్లలో ఓ టేబుల్, చైర్, కంప్యూటర్ సమకూర్చకుని ప్రిన్సిపాల్సే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

కనీసం వారికి సపోర్టింగ్ స్టాఫ్, ఫైలింగ్ కోసం జూనియర్ అసిస్టెంటు సైతం అందుబాటులో లేరు. మరోవైపు విద్యార్థులకు త్వరలో తరగతులు ప్రారంభించాల్సిన సమయమూ వచ్చేసింది. ఇలాంటి సమయంలో వైద్యావిద్యా శాఖ ఎప్పుడు మొద్దు నిద్ర వదలించుకుంటుందోనని ప్రిన్సిపాల్స్ తలలు పట్టుకుంటున్నారు.

అడ్మిషన్లు షురూ అయిన కళాశాలలు ఇవే..

రాష్ట్రంలో కొత్తగా జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, మెదక్, కుత్బుల్లాపూర్, ములుగు, నర్సంపేట, నిర్మల్, రామగుండం, మహేశ్వరం, మధిర, కొడంగల్, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్‌లో నర్సింగ్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. వాటి పరిధిలో ఇప్పటికీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోనే కొత్త నర్సింగ్ కళాశాలలకూ కొంత స్థలం కేటాయింపు జరుగుతోంది. అయితే.. భవనాల నిర్మాణ పనులు మాత్రం ఇప్పటికి ప్రారంభం కాలేదు. చాలా చోట్ల ప్రిన్సిపాల్సే అద్దె భవనాల కోసం సొంతంగా వెతుకులాట ప్రారంభించారని తెలుస్తోంది.

భవనాలను సిద్ధం చేయాల్సిన టీజీఎంఎస్‌ఐడీసీ అధికారులు కనీసం క్షేత్రస్థాయిలోకి రావడం లేదని ప్రిన్సిపాల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అడ్మిషన్ల ప్రక్రియ చేసుకుంటూనే, మరోవైపు భవనాల కోసం సమయం కేటాయించడం కష్టతరమవుతున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వం పెద్దగా కళాశాలల ఏర్పాటు గురించి పెద్దగా పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వం కళాశాలల ఏర్పాటు గురించి పట్టించుకుంటున్నదని నర్సింగ్ ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటుతో బీఎస్సీ నర్సింగ్ చేసే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతోంది. కానీ, భవనాల ఏర్పాటుతో పాటు అత్యంత కీలక అంశమైన ఫ్యాకల్టీ నియామకం విషయంలో యంత్రాంగం డొల్లతనం బయటపడుతోంది.

ఫ్యాకల్టీ నియామకంపై అసలెవరికీ పట్టింపే లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ ఇదే అంశంపై సమీక్ష నిర్వహించి, కొత్త కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అయినప్పటికీ యంత్రాంగం ఆ ఆదేశాలను తేలిగ్గా తీసుకుంటున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

560 లెక్చరర్ పోస్టులు ఖాళీ..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వనర్సింగ్ కళాశాలల్లో 560 డీఎల్ లెక్చరర్ (నర్సింగ్) పోస్టులు 560 ఖాళీలు ఉన్నాయని సమాచారం. పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియ మించకుండానే విద్యార్థులకు ఎవరు  పాఠాలు చెప్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది కొందరు నర్సింగ్ ఆఫీసర్లకు లెక్చరర్లుగా పదోన్నతులు వచ్చినప్పటికీ, ఈసారి ఆ అంశాన్నే ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ అధికారుల్లో సుమారు 200 మందికి ఎమ్మెస్సీ నర్సింగ్‌తో పాటు లెక్చరర్ల పదోన్నతికి అన్ని అర్హతలు ఉన్నాయి. వైద్య విద్య అధికారులు వెంటనే స్పందించి వారికి పదోన్నతులు కల్పిస్తే బాగుంటుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో కొందరు అధికా రులు సర్కార్‌ను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. డైటీషియన్లకు ప్రమోషన్లు ఇచ్చినట్లుగా తమకూ ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు.

పదోన్నతులు కల్పిస్తే ప్రయోజనం

జీవో 101 ప్రకారం నర్సింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఎమ్మెస్సీ నర్సింగ్ పూర్తి చేసి మూడేళ్ల సర్వీస్ ఉన్నవారికి డీఎల్ (నర్సింగ్) పోస్టులకు అర్హత ఉంటుంది. గతేడాది కొందరికి పదోన్నతులు వచ్చాయి. కానీ ఈ ఏడాది పదోన్నతులు లేవు. కొత్త కళాశాలల్లో ఫ్యాకల్టీ లేకుండా విద్యార్థులకు ఎలా పాఠాలు బోధిస్తారో తెలియడం లేదు. ప్రభుత్వం స్పందించాలి.  

 రాపోలు శేఖర్, నర్సింగ్ ఆఫీసర్, రిమ్స్, ఆదిలాబాద్

సర్దుబాటు చేస్తాం

కొత్తగా ఏర్పాటవుతున్న 16 నర్సింగ్ కళాశాలల్లో ఇప్పటికే ప్రిన్సిపాల్స్ నియామకం పూర్తయింది. టీజీఎంస్‌ఐడీసీ సహకారంతో భవనాలను సైతం సమకూరుస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లలో ఎమ్మెస్సీ అర్హత ఉన్న వారిని డిఫ్యుటేషన్‌పై ఫ్యాకల్టీగా తీసుకుంటాం. 

 వాణి, వైద్య విద్య డైరెక్టర్