calender_icon.png 6 March, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాక్టింగ్ వద్దు

06-03-2025 12:46:23 AM

  1. ఎవరు పనిచేస్తున్నారో.. ఎవరు నటిస్తున్నారో నాకు తెలుసు
  2. నా పనితీరు నచ్చకపోతే హైకమాండ్‌కు ఫిర్యాదు చేయవచ్చు
  3. కాంగ్రెస్ పార్టీ జిల్లాల సమీక్షలో పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
  4. 3 గ్రూపులుగా పార్టీ నేతల విభజన.. పార్టీ ప్రక్షాళనకు అడుగులు

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నది ఎవరో, పార్టీకి నష్టం చేస్తున్నదెవరో గుర్తించే పనిని కొత్తగా రాష్ట్రానికి ఇన్‌చార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ విజయవంతంగా చేపట్టారు. కాంగ్రెస్ మరింత బలపడేలా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తనదైన శైలిలో ఆమె పనితీరు సాగుతోంది.

ఇప్పటికే వరుసగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న మీనాక్షి.. ప్రభుత్వం, పార్టీ మధ్య ఉన్న అంతరాలను తొలగించి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీలో ఎవరు బాగా పనిచేస్తున్నారో, ఎవరు పనిచేస్తున్నట్లుగా నటిస్తున్నారో తనకు బాగా తెలుసని మీనాక్షి నటరాజన్ బుధవారం ఘాటుగా వ్యాఖ్యానించారు.

కొంతకాలం గా హస్తం పార్టీకి తలనొప్పిగా మారిన కొత్త, పాత నేతల మధ్య సమన్వయ లోపాన్ని సరిచేసేందుకు ఆమె కొత్త ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీలో అప్పటికే ఉన్న నేతలు, గత అసెంబ్లీ ఎన్నికల ముందు చేరని నేతలు, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన నేతలు అని మూడు గ్రూపులుగా విభజించుకుని పార్టీ పదవులను అప్పగించాలని ఆమె ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

రాష్ర్టంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో కొత్త, పాత నాయకులతో నిండిపోయింది. నేతల సంఖ్య పెరిగిపోయి సొంత నేతలే ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారుతున్నాయి. ఇక ఈ పరిస్థితికి చెక్ పెట్టకుంటే పార్టీకి నష్టం తప్పదని గ్రహించిన నేపథ్యంలో పార్టీ నేతలను మూడు గ్రూపులుగా విభజించి ఆ మేరకు పదవులు కట్టబెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

డీసీసీ పదవుల ఎంపికలోనూ ఇదే పద్ధతి పాటిస్తారని తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షులుగా నియమించే వాళ్ళ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని.. మొదట డీసీసీ అధ్యక్షుల ఆశావహుల నుంచి దరఖాస్తులను తీసుకుని వాటిని పరిశీలించి ఏఐసీసీ నుంచి పరిశీలకులు పంపి సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఏఐసీసీ పరిశీలకులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నియామకాలు జరపాలని నిర్ణయించారని సమాచారం. ఇలా ఉండగా, తన పనితీరు నచ్చకపోయినట్టయితే  తనపైనా అధిష్ఠానానికి ఫిర్యాదు చేయవచ్చని మీనాక్షి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అనుబంధ సంఘాల సమావేశం, ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు జరిగాయి.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశాలలో మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథన్, మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, అనుబంధ సంఘాలకు ఆమె దిశానిర్దేశం చేశారు.

ఏం మాట్లాడినా పార్టీలో అంతర్గతంగా మాట్లాడాలని బహిరంగంగా పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరు ప్రవర్తించినా క్షమించబోమన్నారు. అనుబంధ సంఘాల పాత్ర పార్టీలో చాలా కీలకమైనదని అన్నారు. అనుబంధ సంఘాల ఛైర్మన్‌లను ఆయా కార్పొరేషన్‌లకు చైర్మన్‌లుగా నియమించామని చాలామంది నాయకులకు పార్టీలో పదవులు ఇచ్చామని, ఏడాది అవుతున్నా పదవులు తీసుకున్న వారు అంత బాధ్యతగా పనిచేయడం లేదని అనిపిస్తున్నదని అన్నారు.

ప్రభుత్వ పదవులు తీసుకున్న వారు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేస్తుంటే ఎందుకు వెంటనే స్పందించడం లేదని అన్నారు. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు అలంకార ప్రాయం కావొద్దని చెప్పారు. ఆదిలాబాద్, పెద్దపల్లిలో పార్టీకి మంచి బలం ఉందని, పెద్దపల్లి ఎంపీ స్థానంలో అన్ని స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందన్నారు.

ఆదిలాబాద్‌లో అందరం కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడి పోతున్నామని, పెద్ద ఎత్తున గ్రామాలలో ప్రభుత్వ, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తాను.. మీనాక్షి అనుబంధ సంఘాలలో పనిచేసి ఈ స్థాయికి వచ్చామని అనుబంధ సంఘాలలో పనిచేయడం రాజకీయంగా ఎంతో తృప్తిని ఇస్తుందని అన్నారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమైన అంశమని, పార్టీలో చిత్తశుద్ధితో క్రమశిక్షణగా పనిచేస్తే తప్పకుండా మంచి ఉన్నత పదవులు వస్తాయని అన్నారు.