- సహకార శాఖ ప్రాథమిక విచారణలో వెల్లడి
- భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీలో అంతులేని అక్రమాలు
- అనర్హుల చేతుల్లోకి కోట్ల విలువైన ఫ్లాట్లు, ప్లాట్లు
- సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులపైనే ఆరోపణలు
- రికార్డులను సరిగా నిర్వహించని మేనేజింగ్ కమిటీ
భాగ్యనగర్ సహకార హౌసింగ్ సొసైటీ అక్రమాల పుట్ట పగులుతున్నది. సొసైటీ పెద్దలే రాబందులై సొసైటీ భూములను పీక్కుతిన్న చరిత్ర బయటపడుతున్నది. దశాబ్దాలుగా సొసైటీ భూము లను అడ్డికి పావుశేరు కాడికి అమ్ముకొని సొమ్ముచేసుకొన్న సొసైటీ అధ్యక్షుడు, కార్యదర్శి, సభ్యుల బాగోతం సహకార శాఖ విచారణలో తేటతెల్లమైంది.
రూ.10 వేలు గజం ఉన్న భూమిని రూ.75కే అమ్మటం, రూ.20 వేలు గజం ఉన్న భూమిని రూ.100కే.. అదీ సభ్యులు కాని వారికి కట్టబెట్టడం. వచ్చిన ఆ తూతూమంత్రపు డబ్బును కూడా సొసైటీ పెద్దలు తమ జేబుల్లో వేసుకోవటం.
ఒకరికి అమ్మి న భూమిని మరొకరికి రిజిస్టర్ చేయటం, సొసైటీ బైలాను బైపాస్ చేసి సొంతంగా నిర్ణయాలు తీసుకోవటం, లేని ప్లాట్లు సృష్టించి విక్రయించటం.. అబ్బో ఒకటేమిటి ఈ సొసైటీలో జరిగిన అవినీతి లీలలపై ఓ గ్రంథమే రాయొచ్చని విచారణ అధికారులు చెప్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 2౬ (విజయక్రాం తి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భూముల రేట్లు ఒక్కసారిగా పెరగటంతో వాటిచుట్టూ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్‌లోనే కాదు.. ఉద్యోగులు, కమ్యూనిటీల్లోని కొంతమంది పరస్పర అవగాహన, సహకారంతో ఏర్పాటుచేసుకొనే సహకార సొసైటీ ల్లోనూ ఇలాంటి నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది.
వందలమంది తమ కష్టార్జితాన్ని ధారపోసి ఓ గూడు కొనుక్కొందామని ఆశపడి ఏర్పాటుచేసుకొంటున్న సొసైటీల్లో చీమలు పెట్టిన పుట్టల్లో పాము లు చేరినట్లుగా కొందరు వ్యక్తులు చేరి అందినకాడికి దోచుకొంటున్నారు. ఆరు దశాబ్దాల క్రితం ఏర్పడిన భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీలో తవ్వుతున్నాకొద్ది అక్రమాలు బయటప డుతున్నాయి.
హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా మారిన కూకట్ పల్లిలోని ఈ హౌసింగ్ సొసైటీలో ఫ్లాట్లు, ప్లాట్ల అమ్మకాల్లో రూ.వందల కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సహకార శాఖ నిర్వహించిన విచారణలో అక్రమాలు నిజమేనని తేలింది.
విచారణకు సంబంధించిన ప్రాథమిక నివేదికలో గుర్తించిన అవకతవకలు, అక్రమాల ఆధారంగా మేడ్చల్ జిల్లా సహకార శాఖాధికారి టీ వెంకట్‌రెడ్డి సదరు భాగ్యనగర్ సహకార హౌసిం గ్ సొసైటీకి నోటీసులు జారీచేశారు.
నెల రోజుల్లోగా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటుచేసి జరిగిన అవకతవకలు, అక్రమాలపై చర్చించాలని ఆదేశించారు. కానీ, అక్రమా ల్లో ఆరితేరిన నాయకగణం ఆ ఆదేశాలను కూడా లెక్కచేయటం లేదని సమాచాం. నోటీసులు జారీ చేసి ఇప్పటికే నెల కావస్తున్నది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది.
అడుగడుగునా అక్రమాలే
సంవత్సరాలుగా ఆడిటింగ్ చేయించకపోవడం, అనర్హులకు ఫ్లాట్లు, ప్లాట్లను అమ్మ డం, బహిరంగ మార్కెట్ కన్నా చాలా తక్కు వ ధరకు భూములను అస్మదీయులకు కట్టబెట్టడం, ఒకరికి అమ్మిన ప్లాట్‌ను వేరేవారికి రిజిస్ట్రేషన్ చేయడం.. ఒకటేమిటి భాగ్యనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో జరుగని అవినీతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సహకార శాఖ ప్రాథమిక విచారణలో వెలుగుచూసిన అక్రమాలు ఆ సొసైటీ సభ్యులే విస్తుపోయేలా ఉన్నాయి. ఈ అక్రమాలకు ప్రధాన బాధ్యులుగా భాగ్యనగర్ సహకార హౌసింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు పలువురు ఎంసీ మెంబర్లను గుర్తిస్తూ విచారణ నివేదికలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడమే మిగిలింది.
సొసైటీ బైలాస్‌ను పూర్తిగా పక్కనపెట్టి అందులో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవమరించారని ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని తేలింది. చట్ట ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని నివేదికలో ప్రభుత్వానికి సహకారశాఖ సూచించింది.
ప్రభుత్వం స్పందిస్తుందా?
భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ అక్రమాలు కండ్లముందే కనిపిస్తున్నా.. విచారణలో అవి నిజమని తేలినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సొసైటీలో అక్రమాలపై సొసైటీ సభ్యులు ఇప్పటికే పలుమార్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దృష్టి కి తీసుకెళ్లారు.
సహకార శాఖ అధికారులు దీనిపై ప్రభుత్వానికి నివేదించారు. జిల్లా సహకార శాఖ అధికారులు ఆ శాఖ కమిషనర్‌కు ఇప్పటికే నివేదిక అందించినట్టు తెలు స్తుంది. అయితే మంత్రి తుమ్మల ఈ అక్రమాల పర్వంపై ఇంకా స్పందించలేదని సమాచారం. ప్రభుత్వం ఈ అంశాన్ని
సీరియస్‌గా తీసుకొని లోతుగా విచారిస్తే.. రూ.వందల కోట్ల విలువైన ప్లాట్లు, ఫ్లాట్లు అక్రమంగా అమ్ముకున్నట్టుగా బయటపడుతుందని సొసైటీ సభ్యులంటున్నారు. సహ కార శాఖ మంత్రి తుమ్మల దీనిని సీరియస్ గా తీసుకుని అక్రమార్కులపై క్రిమినల్ కేసు లు నమోదుచేసి.. లెక్కకురాని మొత్తాన్ని బా ధ్యుల నుంచి కక్కించాలని కోరుతున్నారు.
(సొసైటీలో అక్రమాల క్రమంపై కథనం రేపటి సంచికలో..)
కమిషనర్‌కు నివేదిస్తున్నాం!
భాగ్యనగర్ సహకార హౌసింగ్ సొసైటీపై వచ్చిన ఆరోపణలపై ప్రాథమికంగా విచారణ చేయించాం. ఇందులో చాలా వరకు నిర్ధారణ అయ్యాయి. ఫ్లాట్లను, ప్లాట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకున్నారని విచారణలో గుర్తించాం. అలాగే సొసైటీకి వచ్చిన డబ్బుకు కూడా లెక్కాపత్ర లేవు. రికార్డులను సరిగా నిర్వహించలేదు. అంశాలవారీగా ఎవరు బాధ్యులనేది కూడా గుర్తించాం.
దీనికి సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని నెల రోజుల గడు వు ఇస్తూ సొసైటీకి నోటీసులు ఇచ్చాం. నెల రోజులు గడిచిపోయాయి. దీనిపై కమిషనర్‌కు నివేదికను ఇస్తున్నాం. అయితే మరోసారి డిప్యూటీ రిజిస్ట్రార్‌తో స్వతంత్ర విచారణ (ఇండిపెండెంట్ ఎంక్వైరీ) చేసే అవకాశం ఉంది.
ప్రతి అంశంపై లోతుగా విచారణ చేస్తారు. ఇందులో మరిన్ని నిజా లు బయటపడే అవకాశం ఉంటుంది. ఆ నివేదిక వస్తే.. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తారు. ప్రస్తుతానికి ప్రభుత్వానికి పంపించే నివేదికను సిద్ధం చేస్తున్నాం.
జీ వెంకట్‌రెడ్డి,
రిజిస్ట్రార్, సహకార శాఖ, మేడ్చల్.