calender_icon.png 27 November, 2024 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి

28-08-2024 04:22:57 PM

15 పాయింట్ ప్రోగ్రాం అమలుపై సంబంధిత  అధికారులతో సమీక్ష

వక్ఫ్ భూముల ఆక్రమణలపై మైనారిటీ పెద్దలు కమిషన్ దృష్టికి

జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ సహజాది

వనపర్తి, (విజయక్రాంతి): అల్ప సంఖ్యాక వర్గాల అభ్యున్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ సహజాది సూచించారు. బుధవారం  కమిషన్ సభ్యులు వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా ఐడిఒసి సమావేశ మందిరంలో జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ ఆర్. గిరిధర్ తో కలిసి  15 పాయింట్ ప్రోగ్రాం అమలుపై సంబంధిత  అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 15 పాయింట్ ప్రోగ్రాం కింద వనపర్తి జిల్లాలో అల్ప సంఖ్యాక వర్గాల ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పై ఆరా తీశారు. మైనారిటీలకు సంబంధించిన ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, అందులో ప్రభుత్వ స్థలంలో ఉన్నవి ఎన్ని, ఎంతమంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు అనే వివరాలను జిల్లా విద్యా శాఖ అధికారిని ప్రశ్నించారు.  ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలు 15, ఉన్నత పాఠశాలలు 3 ఉన్నాయని వాటిలో 652 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నట్లు డి.ఈ.ఒ  సమాధానం ఇచ్చారు.  మిగిలిన ప్రభుత్వ పాఠశాలల్లోను మైనార్టీ విద్యార్థులు గణనీయంగా విద్యాభ్యాసం చేస్తున్నట్లు తెలిపారు. 

పాఠశాలల్లో  పరిసరాల పరిశుభ్రత పాటించాలని ముఖ్యంగా మరుగుదొడ్లు శుభ్రంగా ఉండవు కాబట్టి ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. తరచుగా పాఠశాలలు సందర్శించి పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. షాదిముబారక్, నైపుణ్య శిక్షణ, షాదిఖానాల నిర్మాణాలు,  ప్రధానమంత్రి జన్ ఆవాస్ యోజన, వక్ఫ్ భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో షాదిఖానాలు మంజూరు అయ్యాయని వాటిలో కొన్ని పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నట్లు ఆర్డీఓ పద్మావతి వివరించారు. లక్ష రూపాయల సబ్సిడీ రుణాలు వంద మందికి ఇవ్వడం జరిగిందని, 280 కుట్టు మిషన్లు, 9809 మంది. మైనార్టీ విద్యార్థులకు రూ. 652 లక్షల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇచ్చినట్లు గణాంకాలు తెలిపారు. మసీదుల వద్ద కామన్ హాల్స్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఆర్డీఓ వివరించారు. ఖిల్లా ఘనపూర్ మండలంలో 21 ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణకు గురి అయినట్లు అదేవిధంగా ఆత్మకూరులో వక్ఫ్ భూముల ఆక్రమణల పై మైనారిటీ పెద్దలు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన కమిటీ సభ్యులు వెంటనే చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ ను ఆదేశించారు. 

 సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది: కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి జిల్లాలో అల్ప సంఖ్యాక వర్గాల అభ్యున్నతి కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఎస్పీ ఆర్. గిరిధర్ మాట్లాడుతూ జిల్లాలో త్రిబుల్ తలాక్ వంటి కేసులు నమోదు కాలేదని, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. అంతకు ముందు కమిషన్ సభ్యులు సయ్యద్ సహజాదిని జిల్లా కలెక్టర్, ఎస్పీ పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలక్టర్ రెవెన్యూ యం నగేష్, ఆర్డీఓ పద్మావతి, జిల్లా అధికారులు తదితరులు, తహశీల్దార్లు,  తదితరులు పాల్గొన్నారు.