calender_icon.png 21 January, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంపైనే బాంబు వేసిన ధీరుడు

03-10-2024 12:00:00 AM

కామిడి సతీష్ రెడ్డి :

నేడు నారాయణరావు పవార్ జయంతి  :

నారాయణ రావు పవార్  తెలంగాణ భగత్ సింగ్‌గా గుర్తింపు పొందారు. రజాకార్ల ఆగడాలను అరికట్టాలంటే.. నిజాంను అంతమొందించాలని ఉ స్మాన్ అలీఖాన్‌పై బాంబు దాడి చేసిన ధీరుడు. నారాయణ రావు పవార్ 1925, అక్టోబరు 3న వరంగల్లులో జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయా రు. ఈయన తండ్రి పండరీనాథ్ బీదర్ జిల్లా నుంచి వరంగల్ కు వలస వచ్చారు.

పవార్ ప్రాథమిక చదువంతావరంగల్ లోనే జరిగింది. ఎనిమిదో తరగతిలో ఉం డగానే ఆర్య సమాజానికి దగ్గరయ్యారు. పండిత్ రుద్రదేవ్, పండిత్ నరేంద్రజీలను తన గురువులుగా ప్రకటించుకున్నారు. 1944 లో ఇంటర్ పాసై లా కోర్సు చేయాలని అందులో చేరినాఆర్థిక పరిస్థితుల కార ణంగా కొనసాగించలేదు.

రేషన్ డిపార్ట్ మెంటులో ఎన్యుమరేటర్‌గా చేరి కొంత ఆ ర్థికంగా నిలదొక్కుకొని లా కోర్సు చేయడానికి హైదరాబాద్ వెళ్లాడు. రాత్రి పూట హ రిజన బస్తీలలో బడులు నడిపి వారి పిల్లలకు విద్య చెప్పే వారు. మాల,మాదిగలతో తిరుగుతున్నందుకు తండ్రికి కోపంగా ఉం డేది. ఇంట్లోకి రావాలంటే బయటే బట్టలు తీసేసి, స్నానం చేసిన తర్వాత లోపలికి రానిచ్చే వారు. అలాగే నడుచుకున్న నారాయణరావు మహాత్మా గాంధీ అస్పృశ్యతపై రాసిన వ్యాసానికి బహుమతి వచ్చింది.

నిజాం హత్యకు మిత్రుల పథకం

నారాయణ రావు హైదరాబాద్‌కు వ చ్చిన తర్వాత కొంత మంది యువకులను చేరదీసి యువ క్రాంతి దళ్ ఏర్పాటు చేశా రు. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ సలహాదారుగా ఉండి కొంత ఆర్థిక సహాయం కూ డా చేసేవారు. ఆ విధంగా ఆర్య సమాజ్ కార్యక్రమాలలో పాల్గొంటూ న్యాయవాద విద్యను కొనసాగించారు. 1946 లో ఒకసారి దారుస్సలాం మైదానంలో మహమ్మ ద్ అలీ జిన్నా ప్రసంగాన్ని విన్నారు.

రెచ్చగొట్టే అతని మాటలు జీర్ణించుకోలేక పో యారు. ఏదైనా సాహసం చేయాలని అపు డే నారాయణరావు మిత్రబృందం నిర్ణయించుకున్నది. లా కోర్సులో భాగంగా ప్ర తి రోజూహైకోర్టులో జరిగే వకాలత్ కోర్సులకు వెళ్లేవారు. ఒకనాడు  నారాయణ రా వు మిత్రుడు వకాలత్ క్లాసులు ఎలా వుం టాయో చూడాలని వెంట వచ్చాడు. ఆలా వారు వెళుతుండగా నయాపూల్ వంతెన వద్ద పోలీసులు వాహనాల రాకపోకలను ఆపేశారు.

ప్రతి రోజు నిజాం నవాబు దారుల్ షిఫాలోని తన తల్లి సమాధిని దర్శించుకోడానికి వెళ్లివస్తుంటాడు. ఆ సమయాలలో పోలీసులు వాహనాల రాకపోకలను ఆపేస్తారు. నిలబడి వున్న నారా యణ రావు మిత్రబృందం కారులో వెళుతున్న నిజాంను చూశారు. అప్పుడు మిత్ర బృందంలోని ఒకడు అనాలోచితంగా, హఠాత్తుగా తన మిత్రులతో  ‘నిజాంను చంపుదామా ....’ అన్నాడు.

ఆ తరువాత ఆ సంగతి గురించి ఎవరూ మాట్లాడు కోలే దు. కొన్ని రోజుల తర్వాత మిత్రుడు బాలకిషన్ ఆ రోజు అనుకున్నట్లు నిజాంను చం పాలని నిర్ణయించుకున్నట్లు నారాయణ రావుకు చెప్పాడు. అందరూ సరేననుకొని ప్రణాళికను రూపొందించుకున్నారు. బాం బులేసినిజాంను చంపాలని, ప్రాణ త్యాగానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకున్నారు.

నారాయణ రావు, పండిత విశ్వనాథ్ బొంబాయి వెళ్లి బాంబులు కొనాలని బయలు దేరారు. మార్గమధ్యంలో షోలాపూర్ వద్ద ప్రముఖ క్రిమినల్ లాయరు లక్ష్మణ రావు బాపూజీ వీరికి కనబడ్డారు.  బాంబులెందుకని లక్ష్మణ రావు అడగగా రజాకార్లను చంపడానికని అబద్ధం చెప్పారు. దాంతో అతను నిజాంనే ఎందుకు చంప కూడదు? అని సూటిగా ప్రశ్నించగా వీరు అసలు సంగతి చెప్పేసారు.

దాంతో లక్ష్మణ రావు వీరికి ఆరు వందల రూపాయలిచ్చి జాగ్రత్తలు చెప్పి పంపారు. బొంబాయిలో రెండు బాంబులు కొని తిరుగు ప్రయాణంలో లక్ష్మణ రావును షోలాపూర్‌లో కలిసి రెండు రివాల్వర్లను అడిగి తీసుకున్నారు.  చివరకు మూడు విషం సీసాలను కూడా అడిగి తీసుకున్నారు. మొదటి రెండు పథకాలు విఫలమైతే మూడో మార్గంగా విషం తీసుకుని చావాలని వీరి పథకం.

ప్రతిజా ్ఞపత్రంపై రక్తంతో సంతకాలు

హైదరాబాద్ వచ్చి వివరంగా ఒక ప్రతి జ్ఞా పత్రాన్ని తయారు చేశారు. నిజాంను ఎందుకు చంపాలనుకున్నారో ఒక పత్రం లో రాసి, ఆ రాసిన నకలును నారాయణ స్వామి వద్ద ఉంచారు. పథకం అమలు చేసిన రోజు నారాయణ స్వామి బెజవాడ వెళ్లి ఆ నకలు పత్రాన్ని, ముగ్గురు మిత్రులు కలిసి తీసుకున్న ఫొటోను పత్రికల వారికి, రేడియో వారికి అంద జేయాలని ముందే నిర్ణయించు కున్నారు. ప్రతిజ్ఞా పత్రంపై ముగ్గురు మిత్రులు నారాయణ రావు పవార్, జగదీష్, గండయ్య తమ రక్తంతో సంతకం చేశారు. 

పథకం అమలుకు వ్యూహం

డిసెంబరు నెల, నాల్గవ తారీఖు 1947 సాయంకాలం నాలుగు గంటల సమ యం. కింగ్ కోఠి రోడ్డు, నిజాం నివాసంముందు. రోడ్డుపై ముగ్గురు మిత్రులు దూ ర దూరంగా నిలబడాలి. మొదటి వ్యక్తి వి ఫలమైతే రెండో వాడు , అక్కడా తప్పితే మూడో వాడు పథకాన్ని అమలు కానివ్వా లి. ఇది వారి పథకం. కింగ్ కోఠి రోడ్డులో ప్రతి చౌరస్తా వద్ద ఒక పోలీసు, మరొక జ వాను ఉన్నారు.

నారాయణ రావు గల్లీలోంచి రోడ్డు పైకి వచ్చి తన సైకిల్‌ను గోడ కు ఆనించడం జవాను గమనించాడు. అ ప్పటికే నిజాం కారు రెండో కానిస్టేబులు వ ద్దకు వచ్చింది. ఇంతలో నారాయణరావు సంచిలో నుండి బాంబు బయటి తీసి ని జాం కారు పైకి విసిరారు. అది పెద్ద శబ్దం తో పేలి పోయింది. అది పడ్డ ప్రదేశంలో పెద్ద గొయ్యి ఏర్పడింది.

ముగ్గురు సాధార ణ పౌరులు తీవ్రంగా గాయపడగా ఒక చి న్న పిల్ల మరణించింది. కారు మాత్రం త ప్పించుకుంది. నారాయణ రావు జేబులో చేయి పెట్టి రివాల్వర్ తీసే లోపే జవాను వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు.బాంబు శబ్దం విన్న మిగతా ఇద్దరూ పథకం సఫ లం అయిందని అక్కడినుండి తప్పుకున్నా రు. నారాయణ రావును పోలీసులు, చు ట్టుపక్కల వున్న ప్రజలు విచక్షణా రహితంగా కొట్టారు.

ఒకడు రాయితో మూతి మీద కొట్టగా పళ్ళు రాలిపోయాయి. బాం బు పేలిన ప్రాంతంలో ఒక డాక్టర్ గారి ఇ ల్లు ఉంది. నారాయణ రావు బాంబు వేస్తున్నప్పుడు మొదట చూసిన వ్యక్తి ఆ డాక్టర్ ఇంటి వాచ్‌మన్. అతను అరబ్బువాడు. వాడు నారాయణ రావును తన మొలలో వున్న బాకు తీసి చంప బోయాడు. అక్కడున్న ఇన్‌స్పెక్టర్ చేయి అడ్డం పెట్టి ఇప్పడే చంపొద్దు...రహస్యాలు రాబట్టాలి అని వారించాడు.

కోర్టు విచారణలో కూడా ఈ అరబ్బు కాపలాదారుడే మొదటి సాక్షి. పోలీసు స్టేషనులో విచారణ సమయంలో నారాయణ రావును నీవు హిందువువా, ముస్లింవా, నీ పేరేమిటని అడగ్గా హిందూ, ముస్లిం తేడా తెలియకుండా ఉండడానికి బాబు అని అన్నాడు. కాని పోలీసులు నా రాయణ రావు బట్టలన్నీ ఊడదీసి హిందువని నిర్ధ్దారించారు.

ఇంతలో నైజామ్ ప్రధాని మీర్ లాయక్ అలీ అక్కడికి వచ్చి నారాయణ రావునుద్దేశించి ‘నిన్ను ఎవరు పంపారు? రాజ కుటుంబీకులా? లేక సర్దార్ పటేలా?’ అని ప్రశ్నించాడు. దానికి నారాయణ రావు తనే స్వయంగా ఈ పని కి పూనుకున్నానని చెప్పాడు. అలా రెండు రోజులు పలు రకాలుగా చిత్ర హింసలు పెట్టారు. ఆ మర్నాడు ఎదురు సెల్ గదిలో గండయ్య ఉన్నాడు.

అతను అద్దెకు తీసుకున్న సైకిల్ ఆధారంతో పోలీసులు గండ య్యను అరెస్ట్ చేశారని ఆ తర్వాత తెలిసిం ది. పోలీసులు వరంగల్లు వెళ్లి నారాయణ రావు ఇంటిని శోధించారు. నారాయణ రావు తండ్రి తన కొడుకు అంత సాహసికుడు కాదన్నాడు. నిజ నిర్ధారణకు అతడిని హైదరాబాదు తీసుకొచ్చి ఖైదీని చూపగా అతడు తన కొడుకేనని ఒప్పుకున్నాడు. 

నారాయణ రావు తన కేసును తనే వాదించుకున్నారు. నారాయణ రావు తండ్రి కొడుకు విడుదల కొరకు పండరీనాథుడు విఠల్ దేవునికి మొక్కుకొని జుట్టు, గడ్డం, మీసాలు పెంచి సాధువులా జీవించాడు. చివరకు అత్యున్నత న్యాయస్థానం నారాయణ రావు పవార్‌కు ఉరిశిక్ష విధించింది. 1948 సెప్టెంబరు 17 న నిజాం నవాబు సర్దార్  పటేల్ ముందు లొంగిపోగా, హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర భారత్‌లో విలీనం అయి పోయింది.

హైదరాబాద్ సంస్థానం విముక్తి తర్వాత మిలిటరీ గవర్నర్ మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి పవార్ ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాడు. కాని వివిధ సంస్థల ఆందోళనతో 1949 ఆగస్టు 10న జనరల్ చౌదరి వీరిని విడుదల చేశారు. నారాయణరావు పవార్ 85 ఏళ్ళ వయసులో హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో 2010 డిసెంబర్ 8న కన్నుమూసారు.

  వ్యాసకర్త సెల్: 9848445134.