ఆర్థిక పరిస్థితులు, బాల్య వివాహం కారణంగా ఆమె చదువుకు దూరం కావాల్సి వచ్చింది. కుటుంబ అవసరాల కోసం చిన్నచితక పనులు చేసింది. అయితే చదువుతోనే సరైన గుర్తింపు, ఆర్థిక భద్రత ఉంటుందని ఆమెకు బోధపడింది. లేటు వయసులో చదువుకోవడం మొదలుపెట్టింది. 74 ఏళ్ల వయసులో డిగ్రీ చదువుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు తంకమ్మ.
కేరళలోని రామాపురం పరిధిలోని వెల్లిలపల్లి గ్రామంలో 1951లో జన్మించిన ఆమె 8వ తరగతి తర్వాత చదువు ఆపేయాల్సి వచ్చింది. అయితే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనాయకత్వ స్థానాన్ని పొందడానికి 10వ తరగతి అర్హత అవసరం కావడంతో చదువుకోవడం మొదలు పెట్టింది. పది, ఇంటర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన తంకమ్మ ప్రస్తుతం బీకాం ఆనర్స్ చేస్తోంది. తన కలను నిజం చేసుకున్న 74 ఏళ్ల తంకమ్మ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.