calender_icon.png 29 December, 2024 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నితీశ్ ది వారియర్

29-12-2024 12:52:16 AM

క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు సమర్థంగా ఎదుర్కొని నిలబడి పోరాడే వాడిని వారియర్ అని పిలుస్తారు. ఈ మాట మన తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. బులెట్స్‌లా దూసుకొస్తున్న ఆసీస్ పేసర్ల బంతులను చీల్చి చెండాడి వీరోచిత శతకంతో మెరిసిన నితీశ్ మెల్‌బోర్న్ గడ్డపై రియల్ వారియర్ అనిపించుకున్నాడు. ఈ ప్రయాణంలో నితీశ్‌కు అండగా నిలబడి అమూల్యమైన అర్థసెంచరీతో మెరిసిన సుందర్‌కు సెల్యూట్ చెప్పాల్సిందే..

‘టీమిండియాలో చోటు దక్కడంతో యాబై శాతం కల నెరవేరింది. ఇవాళ దేశం తరఫున క్లిష్ట పరిస్థితుల్లో సెంచరీ సాధించడంతో అది వంద శాతానికి చేరుకుంది. ఈ శతకం నా కెరీర్‌లో మరిచిపోలేనిది. నా ఇన్నింగ్స్‌కు అండగా నిలిచిన సుందర్‌కు కృతజ్ఞతలు. మ్యాచ్‌కు హాజరైన నా తండ్రి సంతోషాన్ని నా కళ్లతో చూశాను’

  • సుందర్ అర్థసెంచరీ
  • టీమిండియా 358/9 భారత్, ఆసీస్ 
  • నాలుగో టెస్టు

  • మెల్‌బోర్న్ టెస్టులో వీరోచిత శతకం టీమిండియాకు తప్పిన ఫాలోఆన్ గండం

  • మెల్‌బోర్న్: బోర్డర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఫాలోఆన్ గండం నుంచి తప్పించుకుంది. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీకి తోడు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అర్థసెంచరీతో రాణించి టీమిండియాను కష్టాల సుడిగుండంలో నుంచి ఒడ్డున పడేశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (176 బంతుల్లో 105 నాటౌట్), సిరాజ్ (2*) క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో మరో 116 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలండ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

  • ఆ ఇద్దరు నిలబడకపోయుంటే..

164/5 క్రితం రోజు స్కోరుతో మూడో రోజు ఆటను మొదలుపెట్టిన టీమిండియాకు ఆదిలో కష్టాలు తప్పలేదు. పంత్ (28) మంచి టచ్‌లో కనిపించినప్పటికీ అనవసరమైన షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. ఆ తర్వాత జడేజా (17) కూడా పంత్‌ను అనుసరించాడు. దీంతో భారత్ 221 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ఈ దశలో నితీశ్ కుమార్, వాషింగ్టన్ సుందర్ ఓపికతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు.

ఆసీస్ పేసర్ల సంధిస్తున్న బులెట్ లాంటి బంతులను సమర్థంగా అడ్డుకున్న ఈ ఇద్దరు ఒక్కో పరుగు జత చేస్తూ వెళ్లారు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి 81 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ అందుకున్న క్రమంలో నితీశ్ ‘పుష్ప’ సినిమా ఫేమస్ డైలాగ్ తగ్గేదేలేను తలపిస్తూ బ్యాట్‌ను గడ్డానికి తిప్పడం హైలెట్‌గా నిలిచింది. టీ విరామం అనంతరం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న  సుందర్‌ను లియోన్ పెవిలియన్ చేర్చడంతో 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ వెంటనే బుమ్రా కూడా ఔటవ్వడంతో నితీశ్ సెంచరీ మార్క్ చేరుకుంటాడా అని టెన్షన్ నెలకొంది. ఈ దశలో సిరాజ్ అండతో 171 బంతు ల్లో నితీశ్ టెస్టుల్లో తొలి సెంచరీ అం దుకున్నాడు. బ్యాడ్‌లైట్ కారణంగా ఆటను నిలిపివేయగా పెవిలియన్‌కు చేరుకున్న నితీశ్‌కు టీమిండియా, ఆసీస్ ఆటగాళ్లు సహా అభిమానులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం విశేషం.