calender_icon.png 2 February, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేతన జీవులపై నిర్మలమ్మ కటాక్షం!

02-02-2025 01:56:38 AM

దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్

గురజాడను స్మరించిన కేంద్ర ఆర్థికమంత్రి 

నిర్మలా సీతారామన్

12 లక్షల వరకు ఐటీ మినహాయింపు

టీడీఎస్‌లో  మార్పులు అద్దె ఆదాయంపై భారీ ఊరట

ఉపాధి కల్పనకే పెద్దపీట

రూ. 50,65, 345 కోట్లతో కేంద్ర బడ్జెట్

  1. మూలధన వ్యయం రూ.11,21,090 కోట్లు
  2. రెవెన్యూ లోటు రూ.5,23, 846 కోట్లు
  3. ద్రవ్య లోటు రూ.15,68,936 కోట్లు
  4. బీహార్‌కు వరాల జల్లు

ఆశల కేంద్ర బడ్జెట్ రానేవచ్చింది. పేదలు, మధ్యతరగతివారు, రైతులు, మహిళలు లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభు త్వం 3.0 పాలనలో ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇచ్చింది. వికసిత్ భారత్ దిశగా సంస్కరణలు కొనసాగుతాయని ఉద్ఘాటించింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, ఎగుమ తుల ప్రోత్సాహం, ఆవిష్కరణలు..

ఇలా  తమ టార్గెట్‌ను స్పష్టంచేస్తూ  ఈ ఏడాది బడ్జెట్‌ను రూపొందించింది. కేటాయింపుల్లో ఈసారీ రక్షణ రంగమే అగ్రస్థానంలో ఉంది. తొలిసారిగా రూ. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయించి వేతనజీవులకు మోదం కలిగించింది.

వేతన జీవులకు బిగ్ బొనాంజా

రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు

న్యూఢిల్లీ:  దేశంలో వేతనజీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్తచెప్పారు. కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించక్కర్లేదని వెల్లడించారు. ప్రామాణిక తగ్గింపుతో (స్టాండర్డ్ డిడక్షన్) కలుపుకొంటే రూ.12.75 లక్షల వరకు ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించనవసరం లేదని చెప్పారు.

కొత్త పన్ను విధానంలో శ్లాబులు సైతం సవరించారు. అయితే, రూ.12 లక్షల వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూనే రూ.4 లక్షల- నుంచి రూ.8 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను వర్తిస్తుందని చెబుతుండడంతో పలువురు అయోమయానికి లోనవుతున్నారు. ఇది తెలియాలంటే పన్ను లెక్కింపు విధానం గురించి తెలియాలి.

కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. ఒక ఏడాదిలో వచ్చే స్థూల ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి వేతనం ఏడాదికి రూ.12.75 లక్షలు అనుకుంటే అందులో ప్రామాణిక తగ్గింపు రూ.75 వేలు తొలగిస్తారు.

ఇప్పుడు రూ.12 లక్షలను పన్ను ఆదాయంగా పరిగణిస్తారు. ఈ పరిమితి వరకు వర్తించే పన్నును ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87ఏ కింద రిబేట్‌ను మినహాయిస్తారు. అంటే మాఫీ చేసినట్లే. తాజా బడ్జెట్‌లో ఈ రిబేట్‌ను రూ.60 వేలుగా నిర్ణయించారు. కాబట్టి రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.

అయితే స్థూల ఆదాయం రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి దాటినా రిబేటు వర్తించదు.పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో పన్ను వర్తించని ఆదాయం రూ.7.75 లక్షలుగా (ప్రామాణిక తగ్గింపు రూ.75వేలుతో కలిపి) ఉంది. సెక్షన్ 87ఏ కింద రిబేట్ రూ.25వేలుగా ఉంది.

 ఎవరికెంత లాభం?

కొత్త పన్ను విధానంలో తాజా మార్పుల వల్ల రూ.12 లక్షల ఆదాయం పొందుతున్నవారికి రూ.80వేలు మేర ఆదాయపు పన్ను లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్  ప్రసంగంలో తెలిపారు. రూ.18 లక్షలు ఆదాయపు పొందుతున్న వారికైతే రూ.70 వేలు (ప్రస్తుతం 30 శాతం పన్ను అమలవుతోంది) మేలు చేకూరుతుందన్నారు.

అదే రూ.25 లక్షలు ఆదాయం ఉన్న వారికి సవరించిన శ్లాబుల ప్రకారం దాదాపు రూ.1.10 లక్షలు లబ్ధి జరుగుతుందన్నారు. దీనివల్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల రూపంలో లక్ష కోట్ల రూపాయలు, పరోక్ష పన్నుల రూపంలో రూ.2600 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని నిర్మలా సీతారామన్  తెలిపారు.

సవరించిన పన్ను శ్లాబులు 2025-%26 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-%25) పాత పన్ను విధానం ప్రకారమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.


టీడీఎస్‌లో మార్పులు

  1. అద్దె ఆదాయంపై భారీ ఊరట
  2. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ మినహాయింపు రూ.6 లక్షలకు పెంపు

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్‌లో టీడీఎస్‌లో  కీలక మార్పులను ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు, ఇళ్లు, భవనాలపై అద్దె ఆదాయాన్ని పొందేవారికి భారీ ఊరట కల్పించారు. అద్దె ఆదాయంపై వార్షిక టీడీఎస్ మినహాయింపు పరిమితిని రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంచారు.‘ఇది టీడీఎస్ వర్తించే లావాదేవీల సంఖ్యను తగ్గిస్తుంది.

తద్వారా చిన్న చెల్లింపులను స్వీకరించే చిన్న పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది‘ అని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రేట్ల సంఖ్యను తగ్గించడం, పరిమితి మొత్తాలను పెంచడం ద్వారా టీడీఎస్ ఫ్రేమ్వర్క్ను సరళీకృతం చేసే ప్రణాళికలను కూడా ఆమె వివరించారు.

మార్పులు

* సీనియర్ సిటిజన్లకు పన్ను రహిత ఆదాయ పరిమితి రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంచారు.

* అద్దె ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు  పరిమితి వార్షికంగా రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షలకు పెంపు.

* లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద చెల్లింపులపై వసూలు చేసే టీసీఎస్ పరిమితిని రూ.7 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంపు

* పాన్ కార్డు లేని పన్ను చెల్లింపుదారులకు అధిక టీడీఎస్ నిబంధన వర్తిస్తుంది. 

* విద్యా రుణాల చెల్లింపులపై టీసీఎస్ పూర్తీగా తొలగింపు.

ఉపాధి కల్పనకే పెద్దపీట

  1. రూ. 50,65, 345 కోట్ల కేంద్ర బడ్జెట్ 
  2. మూలధన వ్యయం రూ.11,21,090 కోట్లు
  3. రెవెన్యూ లోటు రూ.5,23, 846 కోట్లు 
  4. ద్రవ్య లోటు రూ.15,68,936 కోట్లు
  5. మళ్లీ తెలంగాణకు మొండిచెయ్యి 
  6. ఏపీ పోలవరానికి భారీగా నిధులు
  7. బీహార్‌కూ వరాల జల్లు
  8. రైల్వేకు రూ.2.55 లక్షల కోట్లు
  9. ఈవీలకు ప్రోత్సాహం, తగ్గనున్న క్యాన్సర్ మందుల ధరలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, ఆర్థికాభివృద్ధి మందగించిన వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతుందోనని సామాన్యుడి మొదలుకొని కార్పొరేట్ వర్గాల దాకా అన్నివర్గాలు కాస్త ఆందోళనగా ఎదురు చూశాయి.

అయితే శనివారం ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టిన 202526 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఈ భయాలన్నిటినీ పటాపంచలు చేస్తూ  పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివృద్ధే లక్ష్యంగా మధ్య తరగతి వర్గాలకు వరాలు అందించింది. వికసిత్ భారత్ దిశగా సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతూనే సంక్షేమానికి బడ్జెట్ పెద్ద పీట వేసింది.

మరోవైపు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వేతన జీవులకు భారీ ఊరట కల్పిస్తూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు కల్పించింది. దీనివల్ల కోటి మందికి పైగా ప్రజలకు పన్ను భారంనుంచి ఊరట లభిస్తుందని బడ్జె అనంతరం మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

మొత్తం రూ.50, 65, 345 కోట్లతో నూతన బడ్జెట్‌ను ప్రతిపాదించారు. అయితే గతంలో మాదిరిగానే ఈ సారి కూడా బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచెయ్యే మిగిలింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు కేటాయించిన బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించి నిధుల మాట దేవుడొరుగు.. కనీస ప్రస్తావన కూడా లేదు.

ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్య మంత్రిగా ఉన్న ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు రూ. 12, 157 కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన నిర్మలా సీతారామన్ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సైతం రూ. 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేటాయించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి కూడా తెలంగాణ పట్ల ఈ వివక్ష కొసాగుతూనే ఉండడంపై అధికార కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కూడా మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ అధికార పార్టీ నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక జాతీయ పార్ట్టీలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని కేంద్ర బడ్జెట్‌తో మరోసారి రుజువైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు గేయంలోని ‘ దేశమంటే మట్టికాదోయ్, మనుషులోయ్’ అన్న పదాలతో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలా సీతారామన్  ఈబడ్జెట్‌లో పేదలు, యువత, అన్నదాత, మహిళలపై ప్రధానంగా దృష్టిపెట్టినట్లు ప్రకటించారు.

‘మేకిన్ ఇండియా’లో భాగంగా సాగే ఈ అభివృద్ధి యాత్రలో వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, పెట్టుబడులు, ఎగుమతులు మన శక్తివంతమైన ఇంజిన్లు అని ఆమె పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ రంగాలకు ప్రోత్సాహకాలు అందించారు. రక్షణశాఖ  తర్వాత బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికే పెద్ద పీట వేశారు.

ఈ రంగానికి రూ. 2, 66,817 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి వ్యవసాయ రంగానికి మరో రూ. 1,71, 437 కోట్లు కేటాయించారు. తక్కువ ఉత్పాదకత, పంట దిగుబడి మధ్యస్థంగా ఉండే 100 వెనుక బడిన జిల్లాల్లో  వ్యవసాయానికి ప్రోత్సాహం అందించే పీఎం ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రకటించారు.

దీనికింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తాయి.1.7 కోట్ల గ్రామీణ రైతులకు లబ్ధి చేకూర్చడం దీని లక్ష్యమని ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని ఇప్పుడున్న రూ.3 లక్షలనుంచి రూ. 5లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలమ్మ తెలిపారు.

ఈవీ, మొబైల్ పరిశ్రమలకు ఊతం

ఈవీ బ్యాటరీ తయారీలో ఉపయోగించే 35 రకాల ముడిపదార్థాలు, అలాగే మొబైల్ ఫోన్ తయారీ బ్యాటరీలో ఉపయోగించే 28 అదనపు పరికరాలను పన్ను మిపహాయింపు వస్తువుల జాబితాలో చేర్చడంతో ఈవీలు, మొబైల్ ఫోన్స్ ధరలు దిగి రానున్నాయి. కేన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే 36 రకాల ఔషధాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీనుంచి పూర్తిగా మినహాయించారు. దీనివల్ల ఈ మందుల ధరలు దిగి రానున్నాయి. 

75 వేల మెడికల్ సీట్లు పెంపు

రాబోయే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా మెడికల్ సీట్లను పెంచనున్నట్లు ఆర్థిమంత్రి వెల్లడించారు. వచ్చే ఏడాదినుంచి ఏటా కనీసం 10 వేల చొప్పున రానున్న అయిదేళ్లలో 75 వేల సీట్లను పెంచుతారు. 

విద్య నైపుణ్యాభివృద్ధికి పెద్ద పీట వేసిన బడ్జెట్  విద్యాశాఖకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించింది. ఓ వైపు పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన దిశగా చర్యలు చేపడుతూనే మరోవైపు చిన్నప్పటినుంచే విద్యార్థుల్లో సాంకేతికత, పరిశోధనపై అవగాహన పెంచేలా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సీతారామన్ తెలిపారు.

బీహార్‌కు వరాల వర్షం

మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ మిత్ర పక్షాలకు, సన్నిహిత కార్పొరేట్ వర్గాలకు పెద్ద పీట వేయడం పరిపాటిగా మరింది. ఈ సారికూడా కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన నితీశ్ కుమార్ సీఎంగా ఉన్న బీహార్‌కు  బడ్జెట్‌లో వరాల వర్షం కురిపించారు.

మోదీ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి రాగానే సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లోకూడా బీహా ర్‌కు వరాల జల్లు కురిపించిన కేంద్రం రా ష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృ ష్టిలో పెట్టుకుని మరిన్ని తాయిలాలు ప్రకటించింది. రాష్ట్రంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, నేషనల్ ఫుడ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

అలాగే మిథిలాంచ ల్ ప్రాంతంలో 50 వేల ఎకరాలకు ప్రయో జనం కల్పించే వెస్ట్రన్ కోసి కెనాల్‌కు ఆర్థిక సాయం అందించనుంది. కేంద్రం నిర్ణయాలతో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అవుతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హర్షం వ్యక్తం చేయగా, విపక్షాలు దీన్ని బీహార్ బడ్జెట్‌గా పేర్కొంటున్నాయి.

కొత్త రైల్వే ప్రాజెక్టుల ఊసే లేదు

దాదాపు గంటా 15 నిమిషాల సేపు ప్రసంగించిన నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో  భారత రైల్వేల గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించక పోవడం గమనార్హం. అయితే  రైల్వేకు 2026 ఆర్థిక సంవత్సరానికి  బడ్జెట్‌లో రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. ఈ సారి ఎలాంటి కొత్త ప్రాజెక్టుల జోలికి వెళ్లకుండా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపైనే దృష్టి పెట్టారు.

2024 సాధారణ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి రైల్వేకు రూ.2,55,200 కోట్లను కేటాయించిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 5 శాతం ఎక్కువ నిధులు కేటాయించారు. ఈ సారి బడ్జెట్‌లో కూడా దాదాపు గత ఏడది అంతే మొత్తాన్ని కేటాయించడం గమనార్హం.గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి 100 వందే భారత్ రైళ్లను ప్రకటించారు.

అలాగే దేశంలో మూడు ప్రధాన రైల్వే ఆర్థిక కారిడార్లను ఏర్పాటు చేస్తామన్నారు. వాటి అమలుపై దృష్టిపెట్టిన కేంద్రం ఈ సారి కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులను ప్రకటించలేదు. రైల్వేకు కేటాయించిన మొత్తలో రెవిన్యూ  వ్యయం రూ.3,445 కోట్లు కాగా, మూలధన వ్యయం కింద రూ.2.52 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు.

ఇది ప్రజల బడ్జెట్

ఈ బడ్జెట్ దేశాన్ని వికసిత్ భారత్ వైపు  అడుగులు వేయిస్తుంది. ఇదీ భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉంది. అనేక రంగాల్లో యువతకు అవకాశాలను కల్పిస్తున్నాం. బడ్జెట్‌లు సాధారణంగా ప్రభుత్వ ఖజానా నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్ పెంచేందుకు ఉద్దేశించింది. 

 ప్రధాని నరేంద్రమోదీ