- మధుబనీ చీర ధరించి బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి
- నాలుగేళ్ల కిందటి మాటను నెరవేర్చిన మంత్రి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా ధరించిన చీర మీద ప్రస్తుతం అందరూ దృష్టిని కేంద్రీకరించారు. అందులో అంత గొప్ప ఏముందని అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎవరైనా సరే అకేషన్లకు భారీ ధరలు కలిగిన దుస్తులు ధరిస్తారు. కానీ మంత్రి మాత్రం తను నాలుగేళ్ల క్రితం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక మధుబనీ కళాకారిణి బహూకరించిన చీరను ధరించారు.
ఎవరీ దులారీ దేవి?
బీహార్‌కు చెందిన దులారీ దేవి అనే మధుబనీ కళాకారిణి నాలుగేళ్ల కిందట మంత్రికి ఓ చీరను బహుమతిగా అందించి.. బడ్జెట్ రోజున కట్టుకోవాలని కోరింది. ఆ మాట యాదికి ఉంచుకున్న మంత్రి 2025 బడ్జెట్ సందర్భంగా ఆనాటి బహుమతిని ధరించి అందరినీ అబ్బురపరిచారు.
దీంతో అంతా ఆ చీర గురించి, ఈ కథ గురించి తెగ వెతుకుతున్నారు. నాటి మాటను నిలబెట్టుకున్న మంత్రి మంచి మనసును అంతా మెచ్చుకుంటున్నారు. మంత్రి నాలుగేళ్ల కిందటి మాటను నిలబెట్టుకుంటూ తాను బహూకరించిన చీరను ధరించడంతో దులారీ సంతోషం వ్యక్తం చేశారు.
ఇటీవలే దులారీ దేవికి పద్మశ్రీ..
1968లో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన దులారీ దేవి చిన్ననాటి నుంచి అనేక కష్టనష్టాలను అనుభవించారు. 12 ఏండ్ల ప్రాయంలోనే వివాహం అయిన దులారీకి మెట్టినింట కూడా కష్టాలే స్వాగతం పలికాయి. తొలి నాళ్లల్లో చాలా ఇండ్లల్లో పాచి పని చేసినా కానీ ఆ తర్వాత నెమ్మదిగా మధుబనీ కళ వైపు ప్రయాణం చేసింది దులారీ.
తనకొచ్చిన కళను తోటి మహిళలకు కూడా నేర్పుతూ మహిళా సాధికారతకు కృషి చేస్తున్న దులారీకి 2021లో పద్మ శ్రీ పురస్కారం వరించింది. ఇప్పుడు నిర్మలమ్మ దులారీ దేవి బహూకరించిన చీరను కట్టుకోవడంతో మరోమారు దులారీ దేవి హైలెట్ అయ్యారు.