calender_icon.png 24 September, 2024 | 3:01 AM

ఉద్యోగిని మృతిపై నిర్మల వ్యాఖ్యలు వివాదాస్పదం

24-09-2024 12:53:25 AM

కాంగ్రెస్, శివసేన ఫైర్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివాదంలో చిక్కుకున్నారు. యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి మహాలక్ష్మి మరణాన్ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. విద్యార్థులకు చదువుతో పాటు పని ఒత్తిడిని జయించడం గురించి కూడా విద్యాసంస్థలు బోధించాల్సిన అవసరం ఉందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు విమర్శలకు తావిచ్చాయి. దీంతో కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. చైన్నెలోని ఓ కళాశాలలో ఆదివారం జరిగిన ఓ సదస్సులో నిర్మలా సీతారామన్ మాట్లాడారు.

విద్యార్థులకు మంచి విద్య అందించడం, వారికి కొలువులు వచ్చేలా సన్నద్ధత చేయడంతో పాటు విద్యాసంస్థలు పనిఒత్తిడిని అధిగమించేందుకు ప్రత్యేకమైన బోధన జరగాల్సి ఉందన్నారు. సీఏ చదివిన ఓ యువతి పనిఒత్తిడి తాళలేక ప్రాణాలు తీసుకుందన్న వార్త తనను కలచివేసిందని మృతురాలి పేరుచెప్పకుండానే ప్రస్తావించారు. మరోవైపు ఉద్యోగులను మరయంత్రాల్లా చూస్తున్న కంపెనీల తీరును ఎండగట్టకుండా.. కేవలం పనిఒత్తిడి గురించి కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

కార్పొరేట్ శక్తులు ఉద్యోగు లను పనిఒత్తిడికి గురిచేస్తుంటే.. ఆర్థికమంత్రి మృతురాలిదే తప్పు అన్నట్లు వ్యాఖ్యానించారని మండిపడుతున్నారు. ‘బాధితురాలి పట్ల సానుభూతి గా మాట్లాడాల్సింది పోయి.. ఆమెదే తప్పు అనేలా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేయడం బాధాకరం’ అని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. ‘క్లిష్టమైన కోర్సుల్లో ఒకటిఐన సీఏ డిగ్రీని పూర్తి చేసిన యువతికి పనిఒత్తిడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీలైతే పని విధాన, సుదీర్ఘమై పని గంటలు వంటి అంశాల గురించి చర్చించాలని సూచించారు.