11-04-2025 07:08:38 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని కప్పనపల్లిలోని దట్టమైన అడవిలో తప్పిపోయిన నలుగురు మహిళలను నిర్మల్ పోలీసులు రక్షించారు. కప్పనపల్లి గ్రామంలోని దట్టమైన అడవిలో శుక్రవారం నలుగురు మహిళలు రాజుల రాధ (35), కంబాల లింగవ్వ (36), గట్లమిడి లక్ష్మి (40), బతుల సరోజ (40) కనిపించకుండా పోయ్యారు. బాధిత కుటుంబ సభ్యలు నిర్మల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగ్గి నలుగురు మహిళలను గుర్తించి సురక్షితంగా రక్షించారు.
వివరాల్లోకి వెళితే... నలుగురు మహిళలు గురువారం టెండూ ఆకులు సేకరించేందుకు అడవిలోకి వెళ్లారు. సాయంత్రం అడవి నుండి గ్రామానికి తిరిగి వస్తుండగా దారి తప్పిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు అడవికి వెళ్లిన మహిళలు గ్రామానికి తిరిగి రాకపోవడంతో నిర్మల్ పోలీసులు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన నిర్మల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి జానకి షర్మిల పర్యవేక్షణలో వివిధ ప్రాంతాల నుండి మహిళలను వెతకడానికి 50 మందికి పైగా పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
భీమన్న గుట్టపై డ్రోన్ల సహాయంతో ఐదు గంటల పాటు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మహిళలను గుర్తించి, వారిని సురక్షితంగా గ్రామానికి తీసుకువచ్చారు. అడవి నుండి గ్రామానికి తీసుకువచ్చేటప్పుడు పోలీసులు మహిళలకు పండ్లు, నీళ్లు అందించారు. దీంతో మహిళల భద్రతపై ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మహిళలను వెతకడంలో పోలీసులు తీసుకున్న సత్వర చర్యను గ్రామస్తులు అభినందించారు. శోధన ఆపరేషన్‌లో పాల్గొన్న జానకి షర్మిల ఇతర అధికారులను వారు సత్కరించారు.