26-02-2025 01:48:01 AM
నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో జాప్యంపై కోర్టు నోటీసులు
నిర్మల్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): నిర్మల్ కలెక్టరేట్ భవనంతో పాటు ఆర్డీవో కార్యాలయాన్ని నిర్మల్ కోర్టు జప్తు చేసింది. నిర్మల్ జిల్లాలోని భైంసా సుద్దవాగుపై నిర్మించిన గడ్డెన్నవాగుతో పాటు గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురైన భూనిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం తగిన స్థాయిలో అం నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు.
మొత్తం 90 మందికి పైగా రైతులు తాము కోరుకున్న పరిహారం ప్రభుత్వం అందించలేదని కోర్టును అశ్రయించారు. మూడేళ్ల క్రితమే నిర్మల్ కోర్టులో విచారణ జరుగగా పరిహారంగా రూ.6.79 కోట్లు కలెక్టర్ కార్యాలయం, రూ.1.40 కోట్లు ఆర్డీవో కార్యాలయం చెల్లించాలని ఆదేశించింది. పరిహారం చెల్లించడంలో అధికారులు జాప్యం చేస్తూ వస్తున్నారు.
అధికారులు నిర్లక్ష్యం చేయడంతో గతంలోనే ఫర్నిచర్, అదనపు కలెక్టర్ వాహనాన్ని కోర్టు స్వాధీనం చేసుకున్నది. అప్పటి నుంచి ఈ కేసు అలాగే ఉండగా తాజాగా మంగళవారం నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. అధికారులు పరిహారం చెల్లింపులో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జడ్జి..
ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు నోటీసులు ఇచ్చారు. కోర్టు సిబ్బంది కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో నోటీసు బోర్డుపై ఆ నోటీసులను అతికించారు. ఇక నుంచి ఈ రెండు కార్యాలయ భవనాలు కోర్టు పరిధిలో ఉంటాయని కోర్టు సిబ్బంది తెలిపారు.