calender_icon.png 26 October, 2024 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

నిధులు కరువైన ‘నిర్భయ’

21-05-2024 12:05:00 AM

మనం నిత్యం ఎక్కడో ఓ చోట మహిళలపై హింసకు సంబంధించిన దారుణాలను వింటూనే ఉన్నాం. అది మణిపూర్‌లో మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని హత్య.. పశ్చిమ బెంగాల్‌లో 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. మహిళా రెజ్లర్ల ఆందోళన, ఆరోపణలు.. తమిళనాడులో మైనర్ బాలికపై ఉపాధ్యాయుడి దాడి.. ఈ ఘటనల్లో ఎంతోమంది బాధితులు మన కండ్ల ముందు కదలాడుతుంటారు.

ఇన్ని అఘాయిత్యాల మధ్య మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన నిధులను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తున్నది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ విధానాలను రూపొందిస్తున్నా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఇటువంటి పథకాలను చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే మహిళ నిర్భయంగా, నిబ్బరంగా ఉండగలదు.! 

మహిళల భద్రత కోసం కేంద్రం నిధులు మం జూరు చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వాటిని ఉపయోగించుకోవడం లేదు.  2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ హత్యోదంతం అనంతరం అప్పటి  యూపీఏ ప్రభుత్వం నిర్భయ నిధిని ఏర్పాటు చేసింది. 2013 బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలతో ప్రారంభించింది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. 

వినియోగంలో లోపం

2023లో కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా ‘నిర్భయ’ ఫండ్స్ కింద రూ.12,008 కోట్లు మంజూరు చేసింది. కానీ దాంట్లో రూ.4,923 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ నిధులతో బాధితులకు నష్ట పరిహారం, నేరతీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిఘా కెమెరాల ఏర్పాటు, పెట్రోలింగ్ వాహనాల కొనుగోలు, రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలు ఆధునికీకరణ, అత్యవసర స్పందన, సహాయక విభాగాల ఏర్పాటు తదితర పనులు చేపట్టాల్సి ఉంది.

జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం.. మహిళలపై అకృత్యాల్లో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న మహారాష్ట్రకు నిర్భయ నిధుల నుంచి రూ.149.40 కోట్లను మంజూరు చేయగా ఇంతవరకు ఒక్క రూపాయి సైతం వినియోగించలేదు. మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపురలోనూ ఇదే పరిస్థితి. రూ.50 కోట్లకు మించి ఈ నిధులను పొందిన ఎనిమిది రాష్ట్రాల్లో నూ వినియోగం గరిష్టంగా ఏడు శాతానికి మించలేదు. 

విఫలమైన ప్రభుత్వాలు

2020 ‘వన్ స్టాప్ సెంటర్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.160 కోట్లు కేటాయించింది. ఇతర పథకాల కింద 2021 లో ‘బేటీ బచావో బేటీ పడావో’, ‘నారీ అదాలత్’, ‘మహిళా పోలీస్ వలంటీర్’, ‘మహిళా హెల్ప్‌లైన్’ కింద రూ.183 కోట్లు విడుదల చేసింది. ఈ ఫండ్ వినియోగం 31శాతానికి మించలేదు. రాష్ట్ర ప్రభుత్వాల అవగాహనా లోపంతో ప్రతి ఏడాది మహిళల నిధుల శాతం తగ్గుతోంది.

ఫలితంగా ఆ తర్వాతి సంవత్సరాల్లో ఈ పథకానికి కేటాయింపులు పూర్తిగా తగ్గాయి. అయితే రాజ్యాంగం ప్రకారం మహిళల శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిదే. ఈ విషయంలో సందర్భానుసారంగా ఆర్థిక సహాయం చేయడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిమితమవుతుంది. మహిళలు, బాలికలపట్ల అత్యాచారాలు, అకృత్యాలు మితిమీరిపోతున్న నేపథ్యంలో బాధితులకు పరిహారం, పునరావాసం, అకృత్యాల నివారణ చర్యల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన పథకాల వినియోగంపై అవగాహన చాలా అవసరమని నిపుణుల అభిప్రాయం. 

 రూప

అవగాహన చాలా అవసరం

ముఖ్యంగా ప్రభుత్వ నిధుల మీద అవగాహనా లోపం ప్రధాన సమస్య. ప్రభుత్వం దగ్గర ఫండ్ ఉంది అని తెలిసిన వాళ్లకు కూడా అందులో  ఏమేమి ఉంటాయో కూడా తెలిదు. సమాజానికి అవగాహన కల్పించేలా ఎంతైనా ప్రచారం చేయడం అవసరం. అలాగే పోలీసు శాఖ కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి. వీటిలో కూడా చాలా రకాల హెల్ప్స్ ఉంటాయి కదా. పబ్లిక్ ప్రాసిక్యుటర్ అపియింట్‌మెంట్, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఇవన్నీ ప్రజలకు తెలిస్తే దాన్ని ఎలా వినియోగించుకోవాలో అర్థం అవుతుంది. ఇలాంటి ఫండ్స్ ఉంటాయని తెలియకపోవడమే పెద్ద సమస్య. రెండోది అసలు కేసు నమో దు చేయడమే కష్టం అవుతుంది చాలా సందర్భాల్లో.

ఇక ఫండ్స్ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్ర ప్రభుత్వాల నిధులను తీసుకొచ్చి కరెక్టుగా ఉపయోగించాలి. గత పదేళ్ల కాలంలో చాలా అట్రాసిటీ కేసులు పెరిగాయి. ముఖ్యంగా దళిత, బహుజన వర్గాల అమ్మాయిల విషయంలో కూడా. రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్‌ల్లో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. సాధారణంగా పేద పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ వాళ్లు ఎలాంటి సహ యం లేకుండా బాధితులుగా మిగిలిపోతున్నారు. నిజానికి మహిళా, శిశు సంక్షేమం అనేది రాష్ట్ర ప్రభు త్వం బాధ్యత. మహిళా కమిషన్ వాళ్లు తక్షణమే స్పందించి బాధితులకు ఆర్థిక సహయం చేయడానికి ముందు ఉండాలి. 

 పద్మజ షా, రిటైర్డ్ ప్రొఫెసర్

సమన్వయ లోపం

నిర్భయ నిధులు వినియోగించకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 2016-17 నుంచి 2021-22 వరకు నిర్భయ నిధుల్లో 16 శాతం కూడా వినియోగించుకోలేదు. కేంద్రం రూ.238.06 కోట్లు విడుదల చేస్తే అందులో రాష్ట్రం రూ.200.95 కోట్లు వినియోగించుకుంది. ఓ వైపు రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతుంటే మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఈ ఫండ్స్‌ను వినియోగించుకోకపోవడం విచారకరం. లైంగిక నేరాల దర్యాప్తు కోసం ట్రాకింగ్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేరాల వివరాలను ట్రాకింగ్ చేయడానికి లైంగిక నేరస్థులపై డేటాబేస్ (ఎన్‌డీఎస్‌ఓ) రూపొందించింది.

ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సుదీర్ఘ ఆమోద ప్రక్రియలు ప్రాజెక్టుల అమలుకు ఆటంకంగా మారింది. పటిష్టమైన పర్యవేక్షణ, సమన్వయపరిచే యంత్రాంగం ఉండాలి. నిర్భయ ఫండ్ ద్వారా జరిగే కార్యక్రమాల అమలుపై ఏ ఒక్క ఏజెన్సీ పర్యవేక్షించన జవాబుదారీతనం లోపించింది. నిర్భయ నిధులను ఖర్చు చేసే విషయంలోనూ కొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉంటున్నాయి. బీహార్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఏపీ వంటి రాష్ట్రాలు, లఢక్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఆ జాబితాలో చిట్ట చివరన ఉన్నాయి. 

- స్వేచ్ఛ, హైకోర్టు అడ్వకేట్