calender_icon.png 15 January, 2025 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

90 లక్షల కోట్లకు వినియోగ రుణాలు

12-09-2024 12:42:45 AM

క్రెడిట్ బ్యూరో రిపోర్ట్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: దేశీయ వినియోగాన్ని సూచిస్తూ వివిధ కొనుగోళ్లకు ఖాతాదారులు తీసుకునే వినియోగ రుణాలు పెరుగుతున్నాయి. ముగిసిన 2023 ఆర్థిక సంవత్సంలో దేశంలో కన్జంప్షన్ లోన్ పోర్ట్‌ఫోలియో 15.2 శాతం వృద్ధిచెంది రూ. 90.3 లక్షల కోట్లకు పెరిగినట్లు  క్రెడిట్ బ్యూరో సీఆర్‌ఐఎఫ్ హైమార్క్ తాజా నివేదిక వెల్లడించింది.

అయితే 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో నమోదైన 17.4 శాతం వృద్ధితో పోలిస్తే 2024 మార్చితో ముగిసిన ఏడాదిలో వినియోగ రుణాల వృద్ధి నెమ్మదించిందని, గృహ రుణాల విభాగం తక్కువ వృద్ధిని నమోదు చేయడమే ఇందుకు కారణమని నివేదిక వివరించింది. విలువపరంగా మొత్తం వినియోగ రుణాల్లో  40 శాతం వాటా గృహ రుణాలదే.

2023 హోమ్ లోన్స్ పోర్ట్‌ఫోలియో వృద్ధి 7.9 శాతానికి తగ్గింది. అంతక్రితం ఏడాది ఈ విభాగం 23 శాతం వృద్ధి సాధించింది. ఈ విభాగం వృద్ధి తగ్గినప్పటికీ, రూ.35 లక్షలకు పైబడిన రుణాలకు డిమాండ్ పెరుగుతున్నది. 

భారీగా పెరిగిన వ్యక్తిగత రుణాలు

గృహ రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాల విభాగం జోరుగా వృద్ధిచెందుతున్నది. రిజర్వ్‌బ్యాంక్ పలు రెగ్యులేటరీ సంస్కరణలు చేపట్టినప్పటికీ, పర్సనల్ లోన్స్ 2023 26 శాతం పెరిగాయి. ఈ విభాగంలో రూ.1 లక్ష లోపు రుణాలు అత్యధికంగా ఉన్నప్పటికీ, మొత్తం వ్యక్తిగత రుణాల విలువలో రూ.10 లక్షలకు పైబడిన రుణాల వాటా పెరుగుతున్నది.

విలువ రీత్యా ద్విచక్ర వాహన రుణాల వృద్ధి రేటు 30 శాతం నుంచి 34 శాతానికి పెరిగినప్పటికీ, పరిమాణం వృద్ధి మాత్రం 32 శాతం నుంచి 13 శాతానికి తగ్గింది. ఆటో రుణాలు వృధ్ది రేటు 22 శాతం నుంచి 20 శాతానికి మందగించింది. గృహోత్పత్తుల కొనుగోళ్లకు తీసుకునే రుణాల వృద్ధి మాత్రం భారీగా 26 శాతం నుంచి 34 శాతానికి చేరింది.