- రాష్ట్ర విభజన కంటే గత పాలనలోనే తీవ్ర నష్టం
- అమరావతి అభివృద్ధిని నిలిపి, నష్టానికి కారణమయ్యారు
- ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఆదాయం తగ్గి అప్పు పెరిగిందని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.9.74లక్షల కోట్లు అప్పులు చేశారని ఇంకా కొన్ని లెక్కలు తేలాల్సి ఉన్నదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. శుక్రవారం ఏపీ ఆర్థిక పరిస్థితిపై శాసనసభలో శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తలసరి అప్పు రూ.74.79లక్షల నుంచి రూ.1.44లక్షలకు పెరిగిందన్నారు. తలసరి ఆదాయం 13.2 శాతం నుంచి 9.5శాతానికి తగ్గిందన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఉపయోగపడే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. రూ.466 కోట్లతో పూర్తయ్యే పోలవరం ప్రాజెక్టు గత దుర్మార్గపు పాలనతో నేడు రూ.990 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు.
హైడల్ పవర్ వచ్చి ఉంటే రూ.3వేల కోట్లు ఆదాయం వచ్చేదని, ఒక పోలవరంపై వచ్చిన నష్టం రూ.55వేల కోట్లు అని వెల్లడించారు. ఏపీ స్టేట్ ఫైనాన్సియల్ సర్వీస్ పేరుతో అప్పులు చేసి నిధులు పక్కదారి పట్టించారని సీఎం ఆరోపించారు. మద్యపానం నిషేధాన్ని 25ఏళ్లకు తాకట్టు పెట్టి ఆదాయం ఇతర కార్యక్రమాలకు మళ్లీంచారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన కంటే గత ఐదేళ్ల జగన్ పాలనతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం కేపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను తగ్గించడంతో ఆదాయం తగ్గిందని, అప్పుల భారం పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళాతనం వైపు వెళ్లిపోయిందన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలోనే విమానశ్రయాల అభివృద్ధి, రోడ్లు నిర్మాణాలు, పోర్టుల అభివృద్ధి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇండస్ట్రియల్ కారిడార్లు తీసుకొచ్చి పెట్టుబడులకు ఏపీని చిరునామాగా చేశామని తెలిపారు. గత ప్రభుత్వం వీటన్నింటిని విస్మరించిందని చంద్రబాబు విమర్శించారు.