మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పదిమందికి చేరిందని అధికారులు తెలిపారు. మీరట్‌లోని జాకీర్ కాలనీలో శనివారం మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్),స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో వర్షం మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా ప్రకారం, ఈ ప్రమాదంలో మొదట ముగ్గురు వ్యక్తులు మరణించారు.
అయితే శిథిలాల కింద చిక్కుకున్న 15 మందిలో 13 మందిని ఇప్పటివరకు రక్షించామని, ఇప్పటివరకు పదిమందికి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. గాయపడిన వారిని లాలా లజపతిరాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు రిలీఫ్ కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఈ సంఘటన శనివారం సాయంత్రం 5:15 గంటలకు నగరంలోని జకీర్ కాలనీలో జరిగింది, వెంటనే అత్యవసర సేవలను అధికారులు అప్రమత్తం చేశారు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక దళం, పోలీసు బృందాలు చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.