- ప్రధాన నిందితుడు డాక్టర్ అవినాశ్
- అక్రమ వైద్య వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతాం
- రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు
ఎల్బీనగర్, జనవరి 25: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలకనంద దవాఖానలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు శనివారం 9 మందిని అరెస్టు చేశారు.
సరూర్‌నగర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్‌వోటీ), రంగారెడ్డి జిల్లా వైద్యాధికారుల సమన్వయంతో చేపట్టిన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూశాయి. ఈ మేరకు శనివారం ఎల్బీనగర్‌లోని రాచకొండ క్యాంప్ కార్యాలయంలో సీపీ సుధీర్‌బాబు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అలకనంద దవాఖానలో గత ఏడునెలలుగా డాక్టర్ అవినాశ్, అతడి బృందం అక్రమంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు తేలింది. కేసుకు సంబంధించి డాక్టర్ సిద్దంశెట్టి అవినాశ్(జనరల్ సర్జన్)ను ఇప్పటికే అరెస్టు చేశారు, అలకనంద దవాఖాన ఎండీ డాక్టర్ గుంటుపల్లి సుమంత్ ఇతడిని 23వ తేదీన అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన డాక్టర్ రాజశేఖర్, జమ్ముకశ్మీర్‌కు చెందిన సర్జన్ డాక్టర్ సోహిబ్, ఏపీలోని వైజాగ్‌కు చెందిన పవన్ అలియాస్ కిశోర్, పూర్ణ అలియాస్ అభిషేక్, లక్ష్మణ్, కర్నాటకకు చెందిన పొన్ను స్వామి ప్రదీప్, సూరజ్‌మిశ్రా, తమిళనాడుకు చెందిన శంకర్ కిడ్నీ మార్పిడి అక్రమ వ్యాపారంలో నిందితులు వీరందరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
మెడికల్ అసిస్టెంట్లు అలకనంద దవాఖాన రిసెప్షనిస్ట్ నర్సగాని గోపిని 23న అరెస్టు చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన రమావత్ రవి, సపావత్ రవీందర్, సపావత్ హరీశ్, పొడిల సాయి వీరిని శనివారం(జనవరి 25వ తేదీ) అరెస్టు చేశారు.
వాటాలు తీసుకొని ఆపరేషన్లు..
డాక్టర్ అవినాశ్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేసి.. మహారాష్ట్రలోని పూణెలో సర్జరీలో డిప్లొమా చదివి, అక్కడి దవాఖానలో పనిచేశాడు. తర్వాత 2022లో సైదాబాద్‌లోని మాదన్నపేటలో జనని దవాఖానను నిర్వహించాడు. ఆర్థిక ఇబ్బందులతో జనని దవాఖానను మూసివేశాడు. ఈ క్రమంలోనే వైజాగ్‌కు చెందిన లక్ష్మణ్‌తో పరిచయం పెంచుకుని కిడ్నీ మార్పిడీ వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నారు.
దీనికి ఒక్కో సర్జరీకి రూ.2.50లక్షలు చెల్లిస్తానని, వైద్యులుతోపాటు సిబ్బంది, కిడ్నీ గ్రహీతలు, స్వీకర్తలను తానే చూసుకుంటానని డాక్టర్ అవినాశ్‌కు లక్ష్మణ్ హామీ ఇచ్చాడు. ఈ ఒప్పందంలో డాక్టర్ అవినాశ్ కిడ్నీ మార్పిడి చికిత్సకు కేవలం ఆపరేషన్ థియేటర్, చికిత్స అనంతరం చేసే ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. ఇద్దరు అంగీకారంతో జననీ దవాఖానలో కిడ్నీ చికిత్స చేయడానికి అవినాశ్ ఒప్పుకున్నాడు.
2023 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు కిడ్నీ మార్పిడి చికిత్సలు చేశారు. ఈ క్రమంలో సైదాబాద్‌లోని జననీ దవాఖానను నిర్వాహణ భారంతో డాక్టర్ అవినాశ్ మూసివేశాడు. అనంతరం డాక్టర్ అవినాశ్ 2024లో అలకనంద దవాఖాన ఎండీ డాక్టర్ సుమంత్‌ను సంప్రదించాడు.
కిడ్నీ మార్పిడి చికిత్సకు దవాఖాన ఇవ్వాలని సుమంత్‌ను అవినాశ్ ఒప్పించాడు. దీంతో 2024 నుంచి అలకనంద దవాఖానలో కిడ్నీ మార్పిడి చికిత్సలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 21న ఆ దవాఖానలో కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది. కేసును ఛేదించిన పోలీసు అధికారులను రాచకొండ సీపీ సుధీర్‌బాబు అభినందించారు.