- గరిష్ఠ స్థాయికి చేరిన నీటి మట్టం
- ఇన్‌ఫ్లో 10,270, అవుట్ ఫ్లో 10,400 క్యూసెక్కులు
- తూముల ద్వారా మూసీలోకి నీటి విడుదల
- ప్రమాదకరంగా నాలాలో నీటి ప్రవాహం
- ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుంది. నగర శివారు ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పోటెత్తుతోంది. బంజారాహిల్స్, పికెట్, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి వరద నీరు హుస్సేన్ సాగర్‌లోకి చేరుతుండటంతో సాగర్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది.
దీంతో అప్రమత్తం అయిన అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటిని తూముల ద్వారా మూసీలోకి వదులుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నీటిమట్టం 513.65 మీటర్లకు చేరింది. హుస్సేన్ సాగర్ లోకి ఇన్‌ఫ్లో 10,270 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో 10,400 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ 513.41 మీటర్లు అని అధికారులు తెలిపారు.
ప్రమాదకరంగా నాలా..
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుడా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్‌లోకి వరద ఉధృతి పెరగడంతో అధికారులు జీహెచ్‌ఎంసీ ముందు ఉన్న నాలా నుంచి, హోటల్ మారియట్ వెనుక ఉన్న నాలా నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నాలాలలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. నాలా పరివాహాక ప్రాంతాల్లోని ఇండ్లకు తాకుతూ నీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తం అయిన అధికారులు లోతట్టు, నాలా పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా ఎరుకల బస్తీ, బీఎస్ నగర్, మారుతీనగర్, అరుంధతీ నగర్, సబర్మతీనగర్, బాపూనగర్, అశోక్ నగర్, లంకబస్తీ, మున్సిపల్ క్వార్టర్స్, దోబీఘాట్, రాంనగర్ గుండు తదితర ప్రాంతాల ప్రజలకు వరద ముప్పు ఉందని అధికారులు గుర్తించారు అయితే నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వా ల్ నిర్మిస్తామని ఎన్నికల సమయంలో హామీ లు ఇస్తున్న నాయకులు తదనంతరం విస్మరిస్తున్నారు. దీంతో నాలాలో నీటి ఉధృతి పెరిగిన ప్రతీసారి పరివాహక ప్రాంతాల ప్ర జలు భయం భయంగా బతుకీడుస్తున్నారు.