calender_icon.png 5 November, 2024 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిండుకుండలా హుస్సేన్ సాగర్

16-07-2024 03:00:13 AM

  • వర్షంతో భారీగా చేరిన వరద  
  • 513.43 మీటర్లకు నీటి మట్టం 
  • నీటిని దిగువకు వదులుతున్న జీహెచ్‌ఎంసీ అధికారులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): నగరంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. గరిష్ఠ నీటి మట్టం 514.75 మీటర్లు కాగా, సోమవారం రాత్రి 7.25 గం టల వరకు 513.43 మీటర్లకు చేరింది. ఎఫ్‌టీఎల్‌కు మించి నీరు చేరినట్టుగా జీహె చ్‌ఎంసీ అధికారులు తెలియజేశారు. ఒక్క రోజులోనే హుస్సేన్ సాగర్ నీటి మట్టం నిండుకోవడంతో పాటు సాగర్‌కు క్యాచ్‌పిట్ (ఎగువ) ప్రాంతాలైన కూకట్‌పల్లి, గాజుల రామారం, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి దాదాపు 40 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్స్) వరద నీరు చేరినట్టుగా అధికారులు అంచనా వేశారు. ఒక వేళ మరోసారి వర్షం వస్తే హుస్సేన్ సాగర్ లోతట్టు ప్రాంత బస్తీలు మునిగే ప్రమాదం పొంచి ఉన్నందున, హుస్సేన్ సాగర్ నుంచి లోతట్టు ప్రాంతంలో ఉన్న లోయర్ ట్యాంక్‌బండ్ నాలాలోకి రెండు గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు.

లోతట్టు ప్రాంత ప్రజలు, నాలా పరివాహక నివాసితులకు జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరికొన్ని వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున కవాడిగూడ, దామోదర సంజీవయ్య నగర్, సబర్మతి నగర్, అరుంధతీ నగర్, అశోక్ నగర్, బాపూ నగర్, చిక్కడపల్లి తదితర ప్రాంతాలకు చెందిన బస్తీల ఇళ్లకు నీరు చేరి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ అధికారులు జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో జోనల్, సర్కిల్ స్థాయి అధికారులు అప్రమత్తమయ్యారు.

స్థానిక బస్తీల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. పరిస్థితులు చక్కబడే దాకా హుస్సేన్ సాగర్ నీటి మట్టం, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరుపై నిరంతరం నిఘాతో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు.