20-03-2025 02:33:12 AM
ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
ఒకేసారి 700 మందికి ఆతిథ్యం
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): దేశంలోనే అతిపెద్ద కేఫ్ ‘కేఫ్ నీలోఫర్’ను హైటెక్ సిటీలోని రాయదుర్గంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం ప్రారంభించారు. ఏబీఆర్ కేఫ్ అండ్ బేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన కేఫ్ నీలోఫర్ బ్రాండ్‌లో హైదరాబాద్‌లో 9వ అవుట్ లెట్ ఇది.
కేఫ్ నీలోఫర్ ఎండీ అనుముల శశాంక్ మాట్లాడుతూ.. ఈ ఐకానిక్ కేఫ్ నలబై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందన్నారు. ఒకేసారి 700 మందికి ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం కలదన్నారు. భారతీయులకు ప్రియమైన టీ, బన్ మస్కా, బిస్కెట్లు వివిధ వంటకాలకు ఈ కేఫ్ ప్రసిద్ధి చెందిందన్నారు. ప్రధాన ఆకర్షణగా రెండు టన్నుల ‘నీలోఫర్ క్యాటిల్ ఆఫ్ లవ్’ నిలవనుందన్నారు.
రెండో అంతస్తు ప్రత్యేకంగా రూపకల్పన చేశామన్నారు. ప్రపంచస్థాయి గెదరింగ్, పార్టీ జోన్లు, ఆత్మీయ సమావేశాలు, ప్రొఫెషనల్ మీటింగ్లకు అనువైన వేదికగా నిలుస్తుందన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ చాయ్ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కేఫ్ నీలోఫర్ హైదరాబాద్ ప్రజలకు అత్యుత్తమ చాయ్, రుచికరమైన ఆహారాన్ని అందించడమే కాకుండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా టీ పౌడర్, కుకీలు విక్రయిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేఫ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ అనుముల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.