సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఆసక్తి
మంత్రివర్గ విస్తరణపై జోరుగా ఊహాగానాలు
రాజగోపాల్‌రెడ్డికి పక్కా అంటున్న జిల్లా పార్టీ వర్గాలు
ఎస్టీ కోటాలో బాలూనాయక్‌కు అవకాశం ఉందని చర్చ
నల్లగొండ, అక్టోబర్ 6 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన నల్లగొండ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దసరాలోపే క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని భావిస్తున్న నేపథ్యంలో ఈసారి సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకొంది.
మంత్రివర్గ విస్తరణపై ఆధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ? అని ఆశావహులు ఆసక్తిగా చూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో నల్లగొండ జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పదవి ఖాయమని ఆయన అనుచరవర్గం ధీమా వ్యక్తం చేస్తున్నది. గతంలోనే మంత్రివర్గ విస్తరణ జరగొచ్చని భావించినా సాధ్యం కాలేదు.
నాటి నుంచే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతున్నది. రెండు నెలల క్రితం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఢిల్లీకి వెళ్లిన సమయంలోనూ మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్టు వార్తలు వచ్చాయి. అప్పుడు హైకమాండ్ స్పందించకపోయినా, దసరా ముందు తప్పక ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.
తొలిసారే బెర్త్ ఖాయమని భావించినా..
తొలి క్యాబినెట్‌లోనే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగినా సాధ్యం కాలేదు. మంత్రివర్గంలో 11 మందికి చోటు దక్కింది. ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అవకాశం దక్కించుకున్నారు.
ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటికి చోటు దక్కింది. నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరికి మాత్రమే పదవులు దక్కడంతో ఈసారి విస్తరణలో మరొకరికి అవకాశం ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో మళ్లీ క్యాబినెట్ విస్తరణపై ఊహాగానాలు వెలువడుతుండడంతో ఎవరికి పదవి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది.
ఎస్టీ కోటాలో బాలూనాయక్?
రాష్ట్రంలో ఆదివాసీ (గిరిజన) కో టా నుంచి ములు గు ఎమ్మెల్యే సీతక్క మం త్రిగా ప్రాతినిధ్యంవ హిస్తున్నారు. లంబా డా సామాజిక వర్గం నుంచి రాష్ట్రంలో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఈ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌కు దక్కొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో లంబాడాల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గం కావడం, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ ఇదే నియోజకవర్గం నుంచి కొనసాగుతుండడంతో రాజకీయంగా బీఆర్‌ఎస్ ను దెబ్బతీసేందుకు బాలూనాయక్‌కు మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.