calender_icon.png 5 October, 2024 | 4:46 AM

వచ్చేసారి వంద గెలుస్తం

05-10-2024 02:43:09 AM

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే గెలుపు

కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు

త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ

పీసీసీలో ౬౦ శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు

నిజామాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్

సొంత జిల్లాలో పార్టీ అధ్యక్షుడికి ఘన సన్మానం

పొల్గొన్న మంత్రులు, కాంగ్రెస్ నేతలు

నిజామాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి)/మనోహరాబాద్/రామాయంపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే ఘన విజయం సాధిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడిగా తాను జోడు గుర్రాల లాగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి 90 నుంచి 100 అసెంబ్లీ సీట్లు సాధిస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత శుక్రవారం తొలిసారి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన మహేష్‌కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పాల్గొన్నారు.

సభలో మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతం రాహత్‌నగర్ (నాగన్నపేట్) నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తాను అనేక చీత్కారాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్నానని తెలిపారు. ఎటువంటి రాజకీయ వారసత్వం లేని తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఎన్నడూ ఊహించలేదని అన్నారు.

ఎన్‌ఎస్‌యూఐలోకి తీసుకువచ్చి తన రాజకీయ గురువు డీ శ్రీనివాస్ తనకు రాజకీయాలు పరిచయం చేశారని గుర్తుచేసుకొన్నారు. డీఎస్‌తో తనకు రాజకీయ పొరపొచ్చాలు ఉన్నా ఆయనే తన రాజకీయ గురువు అని తెలిపారు.  

నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తా

గతంలో సస్యశ్యామలంగా ఉండి ప్రస్తుతం వెనుకబడిన నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తానని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు. జిల్లాలో రెండో మెడికల్ కళాశాల, విద్యాసంస్థల స్థాపనకు కృషి చేస్తానని, ప్రాణహిత 20, 21,22 ప్యాకేజీల పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. దేవుడి పేరుతో ఓట్లు అడిగే ప్రధాని మోదీకి, గాంధీల త్యాగం విలువ తెలియదని ఎద్దేవా చేశారు.

10 ఏళ్లుగా అధికారంలో ఉన్న మోదీ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆరోపించారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెట్టాడని విమర్శించారు. రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసిందని, ఖజానాను గుల్లచేసి రోజు ఖర్చులకు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితులు కల్పించిందని మండిపడ్డారు.

సీఎం రిలీఫ్ ఫండ్‌లోనే 40 వేల పెండింగ్ చెక్కులున్నాయని, వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. కేటీఆర్‌కు, హరీష్‌కు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదని, ఫాం హౌజ్‌లో పడుకునే కేసీఆర్‌కు ఎందుకు ప్రతిపక్ష హోదా? అని ఆయన ప్రశ్నించారు. 

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి: కోమటిరెడ్డి

ఎన్‌ఎస్‌యూఐ నుంచి వచ్చిన తాను, పొన్నం ప్రభాకర్, మహేష్‌గౌడ్ ప్రభుత్వంలో, పార్టీలో ఉన్నత స్థానాలకు చేరామని.. కాంగ్రెస్ పార్టీలోనే ఇది సాధ్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా కేసీఆర్ ఫాంహౌజ్‌లో పడుకున్నారని, మోదీని మూడుసార్లు గెలిపించినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కష్టపడ్డవాళ్లను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందని, డీఎస్ లాగా ప్రస్తుతం కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి చక్కని సమన్వయంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడే వారిని అధిష్ఠానం గుర్తిస్తుందనేందుకు మహేష్‌గౌడే నిదర్శనమని అన్నారు. నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలో పార్టీ పటిష్ఠానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి పీసీసీ చీఫ్‌ను కోరారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు మాట్లాడుతూ కులగణన నిర్వహించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ జనాభాలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పార్టీలో న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు.

కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ నేతలు సుదర్శన్‌రెడ్డి, మధు యాష్కి, జీవన్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కార్, భూపతిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మదన్ మోహన్‌రావు, లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. 

దారి పొడుగునా స్వాగతం

పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి సొంత జిల్లాకు వెళ్లిన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు పార్టీ శ్రేణులు అనేక చోట్ల ఘన స్వాగతం పలికాయి. మొదట మేడ్చల్‌లో ఆ తర్వాత మెదక్ జిల్లా సరిహద్దు మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పీసీసీ చీఫ్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

క్రేన్ సహాయంతో భారీ గజమాలను మహేశ్‌గౌడ్‌కు వేశారు. అనంతరం కాళ్లకల్ 44వ జాతీయ రహదారిపై ఉన్న బంగారమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాయంపేట వద్ద స్థానిక నాయకులు పీసీసీ చీఫ్‌ను సత్కరించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్దకు చేరుకున్న మహేష్‌గౌడ్ కాన్వాయి.. ఇందల్వాయి, డిచ్‌పల్లి, మాధవనగర్ మీదుగా నిజామాబాద్‌కు చేరుకుంది. నగరంలో ర్యాలీ నిర్వహించిన తర్వాత కలెక్టరేట్ గ్రౌండ్‌కు చేరుకుని సభలో పాల్గొన్నారు.

కార్యకర్తలను కాపాడుకొంటాం

ఓడినా, గెలిచినా గత 30 ఏళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. పార్టీ తన సేవలు గుర్తించి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిందని చెప్పారు. సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఎదగడం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లో 38 ఏళ్లలో నష్టాలు, కష్టాలే ఎక్కువగా చూశానని, ఆ నష్టాన్ని దేవుడు ఇప్పడు తిరిగి ఇచ్చాడని అన్నారు.

పీసీసీ అధ్యక్షుడిగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పట్టం కడతానని, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు పార్టీ విజయానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలో వేసే పీసీసీ కమిటీల్లో కనీసం 60 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చేందుకు యత్నిస్తానని తెలిపారు.

ఏఐసీసీ అధ్యక్షుడిగా ఓ ఎస్సీని, పీసీసీ అధ్యక్షిడిగా బీసీని నియమించిన కాంగ్రెస్ పార్టీ సమాజంలో దాదాపు 70 నుంచి 80 శాతం ఉన్న అట్టడుగు వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. త్వరలో కులగణన జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజినీరింగ్‌పై దృష్టి సారించిందని వెల్లడించారు. త్వరలో కార్యకర్తలకు నానినేటెడ్ పదవులు ఇస్తామని ప్రకటించారు. 

రేవంత్, మహేష్ రెండు కండ్లు: పొంగులేటి

కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి రెండు కండ్లు అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అప్పటి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌గౌడ్ కృషి ఎంతో ఉన్నదని కొనియాడారు.

వీరి సారధ్యంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రజలకు రేషన్ కార్డులేని లోటు తీర్చుతామని, త్వరలో ప్రజలకు స్మార్ట్‌కార్డులు ఇస్తామని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో ఇదే రేషన్ కార్డుగా, హెల్త్ కార్డుగా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరీతో పాటు ఇతర ప్రభుత్వ పథకాల కోసం పనిచేస్తుందని, ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ఈ కార్డే ఆధారమని చెప్పారు.

దసరాలోపు గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పంపిణి చేస్తామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామ, నాలుగు ఏళ్లలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందిస్తామని ప్రకటించారు. వచ్చే జనవరి నుంచి ప్రజలకు సన్న బియ్యం ఇస్తామని తెలిపారు.