- ఆలోపే క్యాబినెట్ విస్తరణకు అవకాశం
- నామినేటెడ్ పదవుల భర్తీకీ నిర్ణయం
- క్యాబినెట్ బెర్త్ కోసం సీనియర్ల ఒత్తిడి
- ఢిల్లీ పెద్దల వద్ద ఎవరికి వారే ప్రయత్నాలు
- రెండో విడతలో 30 వరకు నామినేటెడ్ పోస్టులు
- పార్టీ కోసం కష్టపడిన వారికే ఇవ్వాలని నిర్ణయం
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): కొన్ని నెలలుగా వివిధ కారణా లతో వాయిదాపడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణతో పాటు నానినేటెడ్ పద వుల భర్తీకి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
డిసెంబర్ 9తో ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కావస్తున్న నేపథ్యం లో ఆలోపే పదవుల పందేరం పూర్తిచేయాలన్న యోచనలో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మంత్రి వర్గంలో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులు, రెండో విడతలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్ పదవు లు, ఇతర నామినేటెడ్ పదవుల్లో దాదా పు 30 మందికి చోటు కల్పించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.
వీటితోపాటు త్వరలో ఖాళీ కానున్న ఎమ్మె ల్సీల అంశంపైనా కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. వీటన్నింటిలో రాష్ట్ర నేతలకే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. మొదటి విడతలో చేపట్టిన నామినేటెడ్ పదవుల్లో ఎక్కువగా పార్టీ అనుబంధ సంఘాలకే ప్రాధాన్యత ఇచ్చారు. రెండో విడతలో కూడా పార్టీ కోసం నిత్యం పని చేసే వారిని గుర్తించి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు.
పదవుల్లో సామాజిక న్యాయం?
పదవుల పంపకంలో జిల్లాలు, సామాజిక సమీకరణాలతోపాటు గతం లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారిని పరిగణలోకి తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజక వర్గం నుంచి టికెట్ కోసం చాలా మంది పోటీ పడ్డారు. అందులో టికెట్ రానివారిలో బలమైన నాయకులకు అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పుడు నామినేటెడ్ పదవు ల్లో అవకాశం కల్పించాలని సీఎం రేవం త్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు ముఖ్య నేతలకు సదరు నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే, మొదటి విడతలో ఒకటి, రెండు కూలాలకే పెద్దపీట వేశారనే విమర్శలు రావడంతో రెండో విడతలో చేపట్టే నామినేటెడ్ పదవుల భర్తీకి అన్ని జాగ్రత్తలు తీసుకుని సామాజిక న్యాయం పాటించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.
మంత్రి వర్గంలో చోటు ఎవరికి?
ఇప్పటివరకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని ఉమ్మడి అదిలాబాద్, నిజా మాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఒక్కొక్కరికి బెర్త్ ఖరారైనట్టు సమాచారం. మరోవైపు ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ఉమ్మడి అదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, గడ్డం వివేక్‌లో ఒకరికి మంత్రి పదవి దక్కనుంది. నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి పేరు దాదాపు ఖరారు అయినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక ఉమ్మడి నల్లగొండలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రులుగా ఉన్నారు. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. గత ఎన్నికల ముందు పార్టీలో చేరే ముందు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, తనకు మంత్రి పదవి వస్తుందని రాజగోపాల్‌రెడ్డి ధీమాతో ఉన్నారు.
గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఒకరే ఉన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇటీవలనే ఎమ్మెల్సీగా ఎన్నికైన అమీర్‌అలీఖాన్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో శ్రీగణేష్ పేరు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.
ఎమ్మెల్యేలకూ కార్పొరేషన్ల చైర్మన్ పదవులు
కీలకమైన ఐదారు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఎమ్మెల్యేలకే ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తే బాగుంటుందనే యోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ, సివి ల్ సప్లయ్, బ్రేవరేజస్, మూసీ రివర్ ఫ్రంట్ తో పాటు మరో ఒకటి, రెండు పదవులు ఎమ్మెల్యేలకు ఇవ్వాలని భావిస్తున్నారు.
ఇలా మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి తగ్గించుకోవచ్చని అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. అంబర్‌పేట టికెట్ రేసులో ఆర్ లక్ష్మణ్‌యాదవ్ ఉన్నప్పటికి.. రేవంత్‌రెడ్డి మాత్రం ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. రెండో విడతలో చేప ట్టే నామినేటెడ్ పదవుల్లో ఆయనకు న్యాయం చేయాలని పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు ఒత్తిడి చేస్తున్నారు.
‘మండలి’ కోసం ఇప్పటి నుంచే ఒత్తిడి
ప్రస్తుతం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్‌రెడ్డి పదవీకాలం వచ్చే మార్చిలో ముగుస్తుంది. మళ్లీ ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి జీవన్‌రెడ్డి ఆసక్తి చూపడం లేదు. దీంతో జీవన్‌రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు పట్టుపడుతున్నారు. మిగిలిన స్థానాలకు కాంగ్రెస్ నేతల నుంచి పోటీ ఎక్కువగా ఉంది.
అద్దంకి దయాకర్, నీలం మధు ముదిరాజ్ పేర్లు ఎమ్మెల్సీ జాబితాలో ఉండే అవకాశం ఉంది. కొల్లాపూర్‌కు చెందిన జగదీశ్వర్‌రావు కూడా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినా తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రి జూపల్లి కాంగ్రెస్‌లో చేరడంతో జగదీశ్వర్‌రావుకు టికెట్ దక్కలేదు.
పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఇప్పుడు ఎమ్మె ల్సీ పదవి కావాలని పట్టుబడుతున్నారు. మేడ్చల్ అసెంబ్లీ టికెట్ ఆశించిన సింగిరెడ్డి హరివర్దన్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్‌కౌషిక్‌యాదవ్, నకిరేకల్ టికెట్ ఆశించి భంగపడిన మల్లయ్యతోపాటు మరికొందరు ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు.
తెర మీదికి నీలం మధు పేరు?
తెలంగాణలో బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఉంటుందని గతంలో రేవంత్‌రెడ్డే స్వయంగా ప్రకటించారు. ఆ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఒక్కరే ఉన్నారు. దీంతో శ్రీహరికి చోటు ఖాయమని ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే సామాజిక వర్గం నుంచి మరో పేరు తెరపైకి వస్తుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన నీలం మధుకు ఎమ్మె ల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో చేర్చుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. నీలం మధుకు మంత్రి పదవి కోసం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ అధిష్ఠానానికి రిఫర్ చేసినట్లుగా పార్టీలోని ఓ కీలక నేత తెలిపారు. ఇక నీలం మధుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సు లు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఏడాది 9 ఎమ్మెల్సీలు ఖాళీ
వచ్చే ఏడాదిలో ఖాళీ అయ్యే 9 ఎమ్మెల్సీ స్థానాలపైన కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. మండలిలో స్థానం దక్కించుకోవడానికి పలువురు నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఖాళీ అయ్యే తొమ్మిది స్థానా ల్లో రెండు టీచర్ కోటా, ఒకటి పట్టభద్రులు, ఒకటి హైదరాబాద్ జిల్లా లోకల్‌బాడీ ఎమ్మెల్సీ స్థానం ఉండగా, మిగతా 5 స్థానాలు ఎమ్మెల్యే కోటాకు సంబంధిం చి ఖాళీ కానున్నాయి.
హైదరాబాద్ లోకల్ బాడీ స్థానం సంఖ్యా బలం ప్రకారం మజ్లిస్ పార్టీకే దక్కనుంది. టీచర్, గ్రాడ్యుయేట్స్‌కు సంబంధించిన ఎమ్మెల్సీల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. ఇక ఎమ్మెల్యేల కోటాకు చెందిన 5 స్థానాలకు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు ఒకటి బీఆర్‌ఎస్‌కు, మిగిలిన నాలుగు స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి దక్కనున్నాయి.
వీటిలో ఒక టి మిత్రపక్షమైన సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. లేదంటే సీపీఐకి కార్పొరేషన్ పదవుల్లో అవకాశమిచ్చి, ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ నేతలకే ఇచ్చే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు.