ముషీరాబాద్ (విజయక్రాంతి): పత్రికలు, ఛానళ్లు ఏ రాజకీయ పక్షం కొమ్ముకాయకుండా ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకగా మారాలని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అభిప్రాయపడ్డారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో వీ-3ఛానల్ ఆరో వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఏ. కోదండరాం, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, అరుణోదయ విమలక్కలు హాజరయ్యారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో వీ3 ఛైర్మన్ కాచం సత్యనారాయణ అలుపెరగని పోరాటం చేశారన్నారు.
ఆయన చేపట్టిన ఏ కార్యక్రమమైనా సక్సెస్ చేస్తారని కొనియాడారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఒక ఛానల్ ను నడపడం ఎంత కష్టమైన పనో తనకు తెలుసునని తాను ఓ ఛానల్ నడిపానన్నారు. 6 ఏళ్లుగా వీ-3 న్యూస్ ని సక్సెస్గా నడపడం కాచం వల్లే సాధ్యమైందన్నారు. ఎంఎల్‌సీ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం మనను మనకు పరిచయం చేసింది. మన గురించి ప్రపంచం ఆలోచించేలా చేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే సొంతంగా పరిపాలించుకోగలరా అనుకున్నవారు ఈనాడు మనను చూసి ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. మీడియా రంగంలో ఆంధ్రావారి పెత్తనం కొనసాగిన తరుణంలో తెలంగాణ వారి నుంచి పత్రికలు, ఛానళ్లు రావలసిన అవసరం కనిపించిందన్నారు. ఉద్యమం సమయంలో వచ్చిన పత్రికలు, ఛానళ్లు భావ వ్యాప్తికి ఎంతో ఉపయోగపడ్డాయన్నారు.
వాటిలో కాచం సత్యనారాయణ ప్రారంభించిన వీ-3 ఛానల్ ఎంతో ముఖ్యమైందని రాజకీయాలకు అతీతంగా దీనిని నడిపారన్నారు. విశ్వంభర దినపత్రికను కూడా విజయవంతంగా తీసుకొస్తున్నారు. కొత్తగా విశ్వంభర ఛానల్‌ను కూడా ప్రారంభించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ సంస్థలన్నీ మరెన్నో మైలురాళ్లు దాటి సమాజ హితం కోసం ప్రజల గొంతుకగా నిలవాలని ఆకాంక్షించారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ.. జర్నలిజం అంటే వాస్తవమన్నారు. సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందినా పత్రికలను తప్పక చదవాలన్నారు. అందుకోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. వీ-3 న్యూస్ జనం పక్షాల నిలబడి వార్తలు అందిస్తున్నారన్నారు. వీ-3 న్యూస్ ఛైర్మన్ డా.కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. 6 ఏళ్లుగా ఎన్నో వ్యయ ప్రయాలకోర్చి రాజకీయాలకతీతంగా ప్రజల పక్షాన నిలబడ్డామన్నారు. ఇక ముందు కూడా అలాగే కొనసాగుతామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆప్ తెలంగాణ కన్వీనర్ సుధాకర్, వీ-3 ఛానల్, అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ విశ్వంభర దినపత్రిక అసోసియేట్ ఎడిటర్ రావికంటి శ్రీనివాస్, వీ3 న్యూస్, విశ్వంభర దినపత్రిక బ్యూరో చీఫ్ పోతుగంటి వెంకటరమణ, వీ3 న్యూస్ కరస్పాండెంట్లు ఏలె మహేశ్, నవీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీ-3 ఛానల్ ఆరోవార్షికోత్సవం సందర్భంగా కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వంభర టీవీ లోగోను ఆవిష్కరించారు.