calender_icon.png 9 October, 2024 | 7:21 PM

డీఎస్సీ విజేతలను చూస్తే దసరా ముందే వచ్చినట్లుంది

09-10-2024 05:51:21 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నియామక పత్రాలను అందజేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా మొత్తం ప్రక్రయ వేగంగా పూర్తి చేసింది. డీఎస్సీలో ఎంపికైన  కొత్త టీచర్లకు నియామకపత్రాలు అందించే కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని, రెండుసార్లు కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నారు.

ప్రత్యేక తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ అవుతాయని అందరూ ఆశించారు. కానీ తెలంగాణ వచ్చిన మూడేళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన రెండేళ్లకు నియామక ప్రక్రియను పూర్తి చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగుల సమస్యలు తీర్చలేదని సీఎం ఎద్దేవా చేశారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఉద్యోగాలు ఊడాలని గతంలో చెప్పినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని నిరుద్యోగులు బాధ్యత తీసుకున్నారు. డీఎస్సీ విజేతలను చూస్తే దసరా పండుగ ముందే వచ్చినట్లు అనిపిస్తుందన్నారు.

65 రోజుల్లో డిఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేసి, 90 రోజుల్లో 30 వేల కొలువులు భర్తీ చేసి నియామక పత్రాలు ఇచ్చామని తెలిపారు.  రాష్ట్ర పునర్ నిర్మాణంలో ప్రభుత్వ బడుల పాత్ర కీలకం అని, గత ప్రభుత్వ హయంలో విద్యాశాఖలో బదిలీలు, పదోన్నతులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీచర్లకు పదోన్నతులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డిఎస్సీ నోటిఫికేషన్ ను అడ్డుకోవాలని కొన్ని కొరివి దెయ్యాలు యత్నించాయని, కేసులు వేసి డీఎస్సీ నోటిఫికేషన్ ను అడ్డుకోవాలని కుట్రలు చేశాయని సీఎం మండిపడ్డారు.