కామారెడ్డి ఆసుపత్రిలో ఘటన
కామారెడ్డి, జనవరి 9 (విజయక్రాంతి): నవజాత శిశువు మృతిచెందిన ఘటన గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గర్భిణి భవానికి బుధవారం మధ్యాహ్నం పురుటినొప్పులు రావడంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రసవం కోసం ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా వైద్యులు వినిపించుకోలేదని తెలిసింది.
నొప్పులు ఎక్కువ కావడంతో గురువారం తెల్లవారుజామున 4 గంటలలకు ఆపరేషన్ చేయగా ఆడ శిశువు జన్మించింది. కానీ కొద్దిసేపటికే శిశువు మృతిచెందింది. దీంతో కుటుంబ సభ్యులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు.
తాము కోరినట్టుగా బుధవారమే ఆపరేషన్ చేసి ఉంటే బిడ్డ బతికేదని, వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డను చంపేశారని మండిపడ్డారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి వారిని ఓదార్చారు. కాగా సరైన గైనిక్ వైద్యులు లేక జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందడం లేదని స్థానికులు ఆరోపించారు.