calender_icon.png 23 December, 2024 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ ఇయర్‌పె ఆబ్కారీ నజర్

23-12-2024 01:19:48 AM

  1. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ఎక్సైజ్ శాఖ ఫోకస్
  2. ప్రభుత్వ ఆమోదిత మద్యమే వినియోగించాలి 
  3. అనుమతిలేని మద్యం, డ్రగ్స్ వినియోగిస్తే కేసులే
  4. తనిఖీల కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు 

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకలకు ఇప్పటి నుంచే యువత ప్లాన్ చేసుకుంటోంది. అన్ని వర్గాల ప్రజలు ఈ ఏడాదిలోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. కొత్త ఏడాదిలోకి ఆనందంగా అడుగుపెట్టాలనే ఉద్దేశంతో ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

అయితే డిసెంబర్ 31న చేసుకునే పార్టీల్లో అనుమతిలేని మద్యం వినియోగాన్ని అరికట్టేందుకు ఆబ్కారీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగంపై ఒక్క గ్రేటర్ పరిధిలోనే 30 నుంచి 40 ప్రత్యేక బృందాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నాన్‌డ్యూటీ లిక్కర్ వినియోగంతో సర్కారు ఆదాయానికి గండిపడుతుతున్న విషయం తెలిసిందే.

ప్రభుత్వ ఆమోదిత మద్యం మినహా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసిన మద్యాన్ని వినియోగిస్తే.. నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగంగా కేసులు నమోదు చేయడానికి ప్రత్యేక నిఘా టీమ్‌లకు ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే కొత్త ఏడాది వేడుకల్లో మద్యానికి బదులు డ్రగ్స్ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

నార్కోటిక్స్, డ్రగ్స్, అండ్ సైకోట్రాపక్ (ఎన్‌డీపీఎస్) చట్టం కేసులు నమోదు చేయనున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఎన్‌డీపీఎస్ కిందకు వచ్చే కొకైన్ ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ బాస్ట్స్, గంజాయి, హిషిన్ ఆయిల్, అల్ఫోజోలం, డైజోఫామ్, హైడ్రోక్లోరిక్‌తో పాటు మరికొన్ని మత్తు పదార్థాలను వినియోగించినా కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు. 

డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షలు.. 

డ్రగ్స్ వినియోగించే వారి వివరాలు తెలుసుకోవడానికి ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ బాక్స్‌తో పరీక్షలు చేయనున్నది. ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే కేసులు నమోదు చేస్తారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖ న్యూ ఇయర్ వేడుకల్లో తనిఖీలు నిర్వహించే ప్రత్యేక టీమ్‌లకు ఈ కిట్స్‌ను అందించారు.

వేడుకల కోసం కమర్షియల్ స్థలాల్లో మద్యం వినియోగించేందుకు అనుమతి పొందిన ప్రాంతాల్లో, అనుమతి తీసుకోని ప్రాంతాల్లోనూ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక టీమ్‌లు తనిఖీలు చేయనున్నారు. ఈక్రమంలో నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు. పబ్బులు, బార్లల్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్ వినియోగించినా చర్యలు తప్పవంటున్నారు. 

రవాణా వ్యవస్థపై నిఘా..

కొత్త సంవత్సర వేడుకలకు ఇతర రాష్ట్రాల నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్ దిగుమతి చేసే అవకాశం ఉండటంతో రవాణా వ్యవస్థపై సంబంధిత శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది. ప్రధానంగా బెంగళూరు, మహారాష్ట్ర నుంచి వచ్చే ట్రావెల్స్‌తోపాటు రాజస్థాన్ నుంచి వచ్చే రైళ్లలోనూ నిత్యం తనిఖీలు చేస్తున్నారు.

అదేవిధంగా గంజాయి అమ్మకాలను పేరుగాంచిన నానక్‌రాంగూడ, దూల్‌పేట్‌తోపాటు గ్రేటర్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లోనూ ఈనెల 31 వరకు తనిఖీలు చేయనున్నారు.