calender_icon.png 19 October, 2024 | 4:43 AM

9 వర్సీటీలకు కొత్త వీసీలు

19-10-2024 02:09:20 AM

  1. ఉస్మానియాకు తొలిసారి దళిత వీసీ
  2. 5 నెలలు ఆలస్యంగా వీసీల నియామకం
  3. జేఎన్టీయూ, అంబేద్కర్, ఫైన్‌ఆర్ట్స్ వర్సిటీలకు పెండింగ్
  4. జేఎన్టీయూకు ఒకే వర్గం నుంచి తీవ్రపోటీ!

హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివ ర్సిటీలకు ఎట్టకేలకు కొత్త వీసీలొచ్చారు. తొమ్మిది యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభు త్వం నూతన వీసీలను నియమించింది. వీసీల నియామక దస్త్రానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలుపటంతో ప్రభు త్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ తొమ్మిది వర్సిటీల్లో ఏడు విద్యాశాఖ పరిధిలోనివి కాగా, రెండు అగ్రికల్చర్, హార్టికల్చర్ వర్సిటీలున్నాయి. అత్యంత ముఖ్యమైన ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కే కుమార్ మొగ్లారామ్‌ను నియమించారు. ఈయన ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

పాలమూరు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, కాకతీయ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి శాతవాహన వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, తెలుగు వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ వెలుదండ నిత్యానందరావు, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ యాదగిరిరావు, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజిరెడ్డిని నియమించినట్లు రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

మహాత్మాగాంధీ వర్సిటీకి అల్తాఫ్ హుస్సేన్ రెండోసారి వీసీగా నియమితులయ్యారు. ఈయన 2016 నుంచి 2019 వరకు ఇదే వర్సిటీకి వీసీగా పనిచేశారు. మిగతా వారంతా కొత్తవారే.

వందేళ్ల తర్వాత ఉస్మానియాకు దళిత వీసీ

యూనివర్సిటీ వీసీల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సమీకరణాలను అమలు చేస్తోంది. అన్ని కులాలకు ప్రాధాన్యమిచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటీవల రెండు యూనివర్సిటీలకు నూతన వీసీలను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. మహిళా యూనివర్సిటీకు ఎస్టీ, బాసర ట్రిపుల్ ఐటీకి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులను వీసీలుగా నియమించింది.

తాజాగా నియమించిన 9 మంది వీసీల్లో నలుగురు ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, ఒకరు ఎస్సీ, బీసీలు ముగ్గురు, ఒకరు మైనార్టీ వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయితే వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకు మొదటిసారి దళిత సామాజికవర్గం వ్యక్తిని వీసీగా నియమించారు.  

మూడు వర్సిటీలు పెండింగ్

విద్యాశాఖ పరిధిలో మొత్తం 12 యూనివర్సిటీలుండగా తొమ్మిదింటికి మాత్రమే వీసీలను నియమించారు. ఇంకా జేఎన్టీయూహెచ్, అంబేద్కర్ ఓపెన్, ఫైన్‌ఆర్ట్స్ వర్సిటీలకు వీసీలను నియమించాల్సి ఉంది. జేఎన్టీయూ వీసీ నియామకంలో సామాజిక సమీకరణాలు పొసగడం లేదని తెలుస్తోంది.

జేఎన్టీయూకు వీసీగా సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన ముగ్గురి పేర్లు ఓసీ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయని సమాచారం. అందులో తాజా మాజీ వీసీ పేరు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా అంబేద్కర్ ఓపెన్, ఫైన్‌ఆర్ట్స్ వర్సిటీల సెర్చ్ కమిటీల సమావేశాలు ఇంత వరకూ జరగలేదు. పలుమార్లు సమావేశాల తేదీలు ఖరారై వాయిదా పడ్డాయి. త్వరలోనే ఈ వర్సిటీలకు సైతం ప్రభుత్వం వీసీలను నియమించనుంది.  

ఐదు నెలలు ఆలస్యంగా..

రాష్ర్టంలోని వర్సిటీలకు గత ఐదు నెలలుగా రెగ్యులర్ వీసీలు లేరు. ఇన్‌చార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది మే 21తో వీసీల పదవీ కాలం ముగిసింది. ఐదు నెలలు ఆలస్యంగా ప్రభుత్వం నూతన వీసీలను నియమించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలల పాటు పది మంది ఐఏఎస్ అధికారులనే వర్సిటీల ఇన్‌చార్జి వీసీలుగా కొనసాగించారు.

తొలుత జూన్ 15 వరకు ఇన్‌చార్జి వీసీలకు బాధ్యతలు అప్పగించారు. అప్పటికి కొత్త వీసీల నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు ఇన్‌చార్జి వీసీలు కొనసాగుతారని ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులిచ్చింది. అప్పటి నుంచి వీరే కొనసాగుతున్నారు.

కాగా, నూతన వీసీల నియామకానికి ఈ ఏడాది జనవరి 27న ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీచేయగా, మొత్తంగా 312 మంది ప్రొఫెసర్లు వీసీ పోస్టు కోసం దరఖాస్తు చేసుకొన్నారు. వారి నుంచి మొత్తం 1,382 దరఖాస్తులొచ్చాయి. ఈ నెలలోనే సెర్చ్ కమిటీ సమావేశాలను నిర్వహించి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను గవర్నర్‌కు పంపించారు. శుక్రవారం గవర్నర్ వీరి నియమాకానికి ఆమోదం తెలిపారు.