calender_icon.png 1 October, 2024 | 6:00 AM

దసరా తర్వాతే కొత్త వీసీలు!

01-10-2024 01:19:50 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): సెర్చ్ కమిటీల తేదీలు దాదాపు ఖరారు కావడంతో రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు త్వరలోనే కొత్త వీసీలు రానున్నారు. ఈ నెల 3, 4వ తేదీల్లో సెర్చ్ కమిటీలు భేటీ కానున్నాయి. ఇప్పటికే 312 మంది ప్రొఫెసర్లు వీసీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ దరఖాస్తులను సెర్చ్ కమిటీలు పరిశీలించి ఒక్కో వర్సిటీకి ముగ్గురి చొప్పున పేర్లను ఫైనల్ చేసి, గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపిస్తుంది. గవర్నర్ ఆమోదం తర్వాత వీసీలను ప్రభుత్వం ప్రకటించనున్నది. ఈ ప్రక్రియకు పది పదిహేను రోజులు పడుతుందని ఓ విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు.

ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీ అందుబాటులో లేకపోవడంతో సెర్చ్ కమిటీల భేటీ తేదీల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టు చెప్పారు. వీలైతే నేరుగా లేదా ఆన్‌లైన్‌లో సమావేశం కానున్నట్టు వెల్లడించారు.

బాసర ట్రిపుల్ ఐటీ, మహిళా వర్సిటీ వీసీల అంశంలో ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఇక వీసీల నియామకం తర్వాత తెలంగాణ ఉన్నత విద్యామండలిలోనూ కొంత మందిని కొత్త వారిని నియమించనున్నట్టు ఆ అధికారి తెలిపారు.