calender_icon.png 16 January, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్-గోవా మధ్య కొత్తగా రైలు

07-07-2024 12:49:19 AM

  1. బుధ, శుక్రవారాల్లో వారానికి రెండుసార్లు 
  2. మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూలు మీదుగా.. 

ప్రధాని, రైల్వే శాఖ మంత్రికి ధన్యవాదాలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదారాబాద్, జూలై 6 (విజయక్రాంతి): హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వారి సంఖ్య ఈ మధ్య భారీగా పెరుగుతోంది. కానీ నేరుగా వెళ్లే రైలు సర్వీసు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నారు. గోవా వెళ్లే పర్యాటకులకు ఈ రైలు ఎంతో సౌలభ్యంగా ఉండనుంది.

సికింద్రాబాద్- వాస్కోడిగామా మధ్య తిరిగే ఈ రైలుకు 17039/17040 నంబర్ కేటాయించారు. ఈ రైలును త్వరలో ప్రారంభించనున్నారు. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. ఇది సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలోనూ ఇవే స్టేషన్ల మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి వాస్కోడిగామాకు ఈ రైలు మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. 

గోవా రైళ్లన్నీ 100 శాతం ఆక్యుపెన్సీ

ఇప్పటివరకు వారానికి ఒకరైలు 10 కోచ్‌లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్ చేరుకొని అక్కడ  తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్‌లతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది. దీంతో పాటు కాచిగూడ- యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ 4 కోచ్‌లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారు. ఈ రైళ్లన్నీ కూడా 100శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయి. దీంతో చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ ఏడాది మార్చి 16న లేఖ రాశారు.

మళ్లీ కేంద్రంలో మూడోసారి మోదీ సర్కారు అధికారంలోకి రావడంతో.. ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇటీవల రైల్వేశాఖ మంత్రిని కలిసిన సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దీనిపై అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఫలితంగా సికింద్రాబాద్-- వాస్కోడగామా (గోవా) మధ్య బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ప్రకటించింది. కొత్త రైలు ఇచ్చినందుకు కేంద్రమంత్రి బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపారు.