calender_icon.png 28 November, 2024 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దసరా తర్వాత కొత్త సార్లు

09-10-2024 02:13:01 AM

సెలవులు ముగియగానే బడులకు పంపేలా కసరత్తు

నేడు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు

ఆ తర్వాత రెండ్రోజుల్లో పోస్టింగ్‌లు

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త సార్లు వస్తున్నారు. దసరా సెలవుల తర్వాత విధుల్లో చేరేలా అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. సరిపడా ఉపాధ్యాయులు లేక గాడి తప్పుతున్న ప్రభుత్వ పాఠశాలలకు కొత్తసార్ల రాక ఊతమివ్వనున్నది.

వీలైనంత వరకు దసరా సెలవులు ముగిసిన వెంటనే కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. బుధ వారం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా డీఎస్సీ అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మొత్తం 11,062 పోస్టుల్లో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులున్నాయి.

వీటిల్లో కోర్టు కేసుల కారణంగా 17 జిల్లాలకు అభ్యర్థులకు మాత్రమే 1:3 జాబితాను విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టారు. మిగతా జిల్లాల అభ్యర్థులకు ఇంకా పూర్తికాలేదు. ఈ క్రమంలో స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు మినహాయించి దాదాపు 10 వేల మందికి ముందస్తుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి, ఆ తర్వాత మిగిలిన వారికి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసారి బ్యాక్‌లాగ్‌కు అవకాశమివ్వ కుండా చర్యలు చేపడుతన్నారు. ఒకే అభ్యర్థి రెండు పోస్టులకు ఎంపికైతే, ఒక పోస్టుకు మాత్రమే ఎంపికయ్యేలా చర్యలు చేపడుతున్నారు. మొదట స్కూల్ అసిస్టెంట్ పోస్టుల జాబితాను విడుదల చేసి, తర్వాత ఎస్జీటీ జాబితాను విడుదల చేయనున్నారు.

నాలుగైదు రోజులు శిక్షణ

ఉపాధ్యాయులుగా కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న డీఎస్సీ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణిచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాబోధన, సర్వీస్ మేటర్స్, పాటించాల్సిన నియమ నిబంధనలతో కూడిన అంశాలపై ప్రత్యేక శిక్షణను ఆయా జిల్లాల్లో అభ్యర్థులకు ఇవ్వనున్నారు. టీచర్లను పూర్తిగా సంసిద్ధం చేసి తర్వాత బడులకు పంపిస్తారు. 33 జిల్లాల్లో కలిపి మొత్తం 11,062 పోస్టులున్నప్పటికీ, ఈ పోస్టులన్నీ భర్తీ కావు. కొన్ని క్యాటగిరీల్లో అభ్యర్థులు లేక, ఇతరత్రా కారణాలతో మొత్తం పోస్టుల్లో ఐదారొందలు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది.

డీఎస్సీ పోస్టుల వివరాలు

పోస్టు క్యాటగిరీ పోస్టులు

ఎస్‌ఏ 2,629

ఎస్జీటీ 6,508

ఎల్‌పీ 727

పీఈటీ 182

మొత్తం 10,046

స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు

ఎస్‌ఏ 220

ఎస్జీటీ 796

మొత్తం 1,016

మొత్తం 11,062