calender_icon.png 24 September, 2024 | 2:04 PM

రోడ్ల నిర్మాణంలో నూతన సాంకేతికత

24-09-2024 12:33:03 AM

రహదారుల ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యం

ప్రపంచబ్యాంక్ ప్రతినిధి బృందంతో మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): రహదారుల నిర్మాణంలో ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్న నూతన సాంకేతికతను తెలంగాణలోనూ వినియోగిస్తామని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. స్మార్ట్ రోడ్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఫ్యూచరిస్టిక్ ఆటోమేటెడ్ కన్‌స్ట్రక్షన్, ఐసీటీ వంటి అధునాతన పద్ధతులతో రోడ్డు మరణాలను తగ్గిస్తామన్నారు. సోమవారం సచివాలయంలో ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

వరల్డ్ బ్యాంక్ సహకారంతో మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రోడ్ల నిర్మాణాలు, వాటి తీరుతెన్నులపై పీపీటీ రూపంలో ప్రపంచబ్యాంక్ రవాణారంగ ప్రధాన అధికారిణి రీనూ అనుజా మంత్రికి వివరించారు. ఐసీటీ ఆధారిత విధానంతో ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చని తెలిపారు. మెగా క్లస్టర్స్ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలను నగరాలతో అనుసంధానించడం, విమెన్ స్కిల్లింగ్ హబ్స్ ఏర్పాటు వంటి నూతన విధానాల ద్వారా రాష్ర్ట ప్రగతిని వేగవంతం చేయొచ్చని తన ప్రజెంటేషన్‌లో వివరించారు.

రాష్ర్టంలో ఇన్నోవేటివ్ ఫైనాన్స్ మోడల్ ద్వారా ఆర్థిక సహకారం అందించేందుకు అనువైన ప్రాజెక్టుల గురించి అనుజా మంత్రికి వివరిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతప్రభుత్వం పదేండ్లలో రోడ్డు భద్రతా ప్రమాణాలు ఏ మాత్రం పాటించలేదని, ప్రమాద బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు కనీసం ట్రామాకేర్ సెంటర్లను కూడా నిర్మించలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అత్యంత ప్రమాదకరంగా ఉన్న హైవేలపై ట్రామాకేర్ సెంటర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామన్నారు.

హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రామాకేర్ సెంటర్ నిర్మాణంలో ఉందన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి ప్రపంచబ్యాంక్ సహకారంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, ఈఎన్సీ మధుసూధన్ రెడ్డితో పాటు శాఖకు సంబంధించిన సీఈ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.