calender_icon.png 12 October, 2024 | 1:54 AM

నిర్మాణ రంగంలో న్యూ టెక్నాలజీ

25-08-2024 12:00:00 AM

  1. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ప్రాజెక్టు డిజైన్, డ్రాయింగ్
  2. సాంకేతికతతో సకాలంలో నిర్మాణాలు
  3. కీలకంగా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  
  4. మైవాన్ టెక్నాలజీ సాయంతో గోడల నిర్మాణం

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 24 (విజయక్రాంతి) ః ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఓ నానుడి ఉంది. ఒకప్పుడు చిన్న ఇల్లు మొదలుపెడితే అది పూర్తయ్యేసరికి ఒకటి రెండు సంవత్సరాలు పట్టేది. కానీ నిర్మాణ రంగంలో సాంకేతికత పెరగడంతో ప్రస్తుతం బిల్డర్లు కొన్ని నెలల్లోనే ఆకాశహర్మ్యాలను నిర్మించి బయ్యర్ల డిమాండ్‌కు అనుగుణంగా నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయగలుగుతు న్నారు. అలాగే నిర్మాణ రంగంలో సాంకేతికతను వినియోగించడం వలన స్పష్టమైన ప్రణాళిక, వేగంగా నిర్మాణం, క్వాలిటీ కన్‌స్ట్రక్షన్‌తో పాటు మెటీరియల్ దుర్వినియోగం తగ్గడంతో ప్రాజెక్టు వ్యయంపై కూడా తగ్గి ఇంటి ధరలు కూడా తగ్గుతున్నాయని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు.

గతంలో ఐదు, పది అంతస్తుల నిర్మాణాలే ఉండేవి. కానీ ప్రస్తుతం 20 నుంచి 50 అంతస్తుల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సంప్రదాయ పద్ధతులకు గుడ్ బై చెప్పి, నూతన టెక్నాలజీతో బహుల అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ప్రణాళిక మొదలు అన్ని విభాగాల్లోనూ టెక్నాలజీ వాడకం పెరిగింది. నిర్మాణ ప్రాజెక్టు ప్రణాళిక, నాణ్యత, పర్యవేక్షణ వంటి వాటన్నింటిని టెక్నాలజీ సాయంతో సులభంగా పూర్తి చేస్తున్నారు. మార్కెట్ లో అందుబాటులో ఉన్న పలు రకాల సాఫ్ట్‌వేర్‌ల ద్వారా నిర్మాణ ప్రాజెక్టు డిజై న్, డ్రాయింగ్ తో కావలసిన మెటీరియల్, మ్యాన్ పవర్, బడ్జెట్, నిర్మాణ వ్యయంపై ఖచ్చితత్వం వస్తుం ది.

బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, మాడ్యులర్ కన్‌స్ట్రక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు. సాంకేతిక వినియోగంతో నిర్మాణ నాణ్యత పెరుగుతోంది. గతంలో మట్టి, సిమెంటు ఇటుకలతో ఇంటి గోడలను నిర్మించేవారు. కాని ప్రస్తుతం అందుబాటులో ఉన్న మైవాన్ టెక్నాలజీ సాయంతో గోడలు సైతం కాంక్రీట్ తో కట్టేస్తున్నారు. దీంతో నాణ్యత పెరగడంతో పాటు త్వరితగ తిన నిర్మాణం పూర్తవుతుంది. నిర్మాణ రంగంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడం వల్ల రియల్ టైమ్ మానిటరింగ్ సాధ్యమవుతుంది. ఇందుకోసం డ్రోన్లు, సెన్సార్లను ఉపయోగిస్తున్నారు.

రియల్ టైమ్ మానిటరింగ్‌తో కన్‌స్ట్రక్షన్ రంగంలో తరుచుగా చోటుచేసు కునే ప్రమాదాలను నివారించడమే కాకుండా భద్రతకు ఎక్కువ అవకాశం ఉంటుందని నిపుణులు చెబు తున్నారు. ఇక ఆటోమేటెడ్ మెషినరీ సిస్టమ్ ద్వారా నిర్మాణానికి కావాల్సిన అంశాలన్నింటినీ ఆటోమేట్ ప్రోగ్రాం చేయడం వల్ల కూడా ప్రమాదాల నివారణ జరిగి కార్మికుల భద్రతకు అవకాశం ఉంటుందని అం టున్నారు. మరోవైపు వర్చువల్ రియాలిటీ నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. నివాస, వాణిజ్య నిర్మాణాలకు సంబంధించి ప్లాన్, ఎగ్జిక్యూషన్‌కు వర్చువల్ రియాలిటీ దోహదం చేస్తోంది. అనుకున్న ప్రణాళికతో  సమయానికి నిర్మాణం పూర్తి చేసేందుకు వర్చువల్ రియాలిటీ ఎంతో ఉపయోగపడుతోంది.

రోబోటిక్ లేఅవుట్ సాధనాలు..

భారత్ నిర్మాణ రంగంలో రోబోటిక్ లేఅవుట్ సాధనాలను విరివిగా ఉపయోగిస్తున్నారు. రోబోటిక్ లేఅవుట్స్ కన్‌స్ట్రక్షన్ టాస్క్‌లను ఆటోమేట్ చేయడంవల్ల మ్యాన్ పవర్ తగ్గడంతో పాటు నిర్మాణ టాస్క్‌ను త్వరితగతిన పూర్తి చేయవచ్చు. రోబోటిక్ లేఅవుట్స్ నిర్మాణానికి సంబంధించిన వర్క్‌ను ఖచ్చితత్వంతో షెడ్యూల్ చేయడం వల్ల వేగంగా నిర్మాణం జరగడంతో పాటు ఖర్చు సైతం తగ్గుతుంది. ఇది బిల్డర్‌తో పాటు ఇల్లు కొనుగోలుదారులకు ఆర్థిక భారాన్ని కొంత మేర తగ్గిస్తుంది. ఇక నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న మరో సాంకేతిక అంశం బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. ఈ టెక్నాలజీ ఆటోమేటెడ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ కాంప్లెక్స్ ద్వారా నిర్మాణంలో లోపాలను సరిచేస్తుంది.

ఒక విధంగా చెప్పాలంటే తక్కువ లోపాలతో నిర్మాణ ప్రాజెక్ట్లను వేగంగా పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే నిర్మాణ రంగంలో విరివిగా 3డి ప్రింటింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. దీని ద్వారా రోబోటిక్ లేఅవుట్ ప్రింటర్ల సాయంతో నిర్మాణానికి సంబంధించిన డిజైన్, లేఆవుట్, బిల్డింగ్ కాంపోనెంట్, డిజిటల్ మోడల్స్‌ను నేరుగా ఆన్‌సైట్ లో ప్రింట్ చేసుకోవచ్చు. అంతేకాదు వర్చువల్ రియాల్టీ ద్వారా ఎప్పటికప్పుడు పనితీరును సరిచూసుకోవచ్చు.

3డి ప్రింటింగ్ రోబోటిక్ లేఅవుట్ టెక్నాలజీ ద్వారా వేగంగా నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఖచ్చితత్వం, నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ వెస్టేజ్ ను భారీగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కన్‌స్ట్రక్షన్ రంగంలో అత్యంత ప్రభావం చూపుతున్న మరో టెక్నాలజీ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ డ్రోన్లు.  సైట్ సర్వే, మ్యాప్, ఆన్ సైట్ డేటా వంటిని అత్యంత కచ్చితత్వంతో క్రోడీకరించడానికి, ఆ తరువాత నిర్మాణ క్రమంలో నిర్వహించడానికి సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ డ్రోన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దీని ద్వారా సమయం ఆదా కావడంతోపాటు  స్పష్టమైన ప్రణాళికతో అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయవచ్చు.

మాడ్యూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్...

సహజసిద్ధంగా ఉపయోగించబడుతున్న సాంకేతిక మాడ్యూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్మాణ రంగంలో కీలకంగా మారింది. ఏఐ టెక్నాలజీ నిర్మా ణ ప్రాజెక్టు షెడ్యూలింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం దోహదపడుతుంది. నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశం డేటాను విశ్లేషించడం, నిర్మాణం షెడ్యూల్లను ఆప్టిమైజ్ చేయడం, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ ను సమర్థవంతంగా వాడుకోవడం, ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేయడం వంటి ఎన్నో అంశాలను ఎగ్జిక్యూట్ చేస్తోంది. ఇక ప్రీ ఫ్యాబ్రికేషన్ టెక్నిక్స్ ను కూడా భారత నిర్మాణ రంగంలో బాగా ఉపయోగిస్తున్నారు. ప్రీ ఫ్యాబ్రికేషన్‌తో ఆఫ్‌సైట్ భాగాలను విడిగా తయారు చేసి, వాటిని నిర్మాణ ప్రదేశానికి తరలించి నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. ప్రీ ఫ్యాబ్రికేషన్ పద్ధతి ఆన్‌సైట్ లేబర్‌ను తగ్గించడంతో పాటు నిర్మాణ వ్యర్థాలను తగ్గించి మొత్తం ప్రాజెక్ట్ టైమ్‌లైన్‌ను వేగవంతం చేస్తుంది.

ఫిజికల్ జాబ్ సైట్ కోసం...

డిజిటల్ సూచనలతో నేరుగా ఫిజికల్ జాబ్ సైట్ కోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఆటోమేటెడ్ మెషినరీ, అధునాతన ప్రాజెక్ట్ ప్లానింగ్ మరియు మేనేజ్మెంట్ టూల్స్ ను కూడా నిర్మాణ రంగంలో వాడుతున్నారు. గతంలో నిర్మాణ సామగ్రి పెద్ద ఎత్తున దుర్వినియోగం అయ్యేది. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో అది 90 శాతం మేర తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇక నిర్మాణ ప్రాజెక్టులో పనిచేసే పలు విభాగాల బృందాలతో సమన్వయం చేసుకునేందుకు సైతం టెక్నాలజీని వినియోగించడంతో పని సులభతరం అవుతోంది. ఇప్పటికే డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ అమ్మకాల్లో జోరు పెంచిన నిర్మాణరంగం, తాజాగా కన్‌స్ట్రక్షన్‌లోను ఆధునిక సాంకేతికను జోడించి మరింత దూసుకుపోతోంది.